రెండేండ్లలో జల వివాదాల పరిష్కారం

నదీజలాల విషయంలో రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు రెండేండ్లలోనే పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు నిర్దిష్ట నిబంధనలను పొందుపరుస్తూ కేంద్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాల బిల్లు-2019ను రూపొందించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాల బిల్లు-1956 స్థానంలో రూపొందించిన ఈ బిల్లును బుధవారం కేంద్ర జలశక్తి అభియాన్ శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ దీనిని సభలో ప్రవేశపెట్టగా.. మూజువాణి ఓటు ద్వారా సభ ఆమోదించింది. 

ఈ బిల్లు ప్రకారం దేశం మొత్తం ఒకే ట్రిబ్యునల్ ఉంటుంది. దీనికి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చైర్మన్‌గా ఉంటారు. రాష్ర్టాల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా బెంచ్‌లను ఏర్పాటుచేస్తారు. రెండేండ్లలోగా ఆయా బెంచ్ లు జల వివాదాలను పరిష్కరించాల్సి ఉంటు ంది. కాగా బిల్లును రూపొందించేముందు రాష్ట్రాలను సంప్రదించలేదని ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ప్రతిపక్షాలు తెలిపాయి.

బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మాట్లాడుతూ రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాలను పరిష్కరించడంలో ప్రస్తుతం ఉన్న ట్రిబ్యునళ్లు విఫలం అయ్యాయని తెలిపారు. కొన్ని ట్రిబ్యునళ్లు 33 ఏండ్లు గడుస్తున్నా వివాదాలను పరిష్కరించలేకపోయాయని ఉదహరించారు. ఈ నేపథ్యంలో మార్పు తప్పనిసరి అయ్యిందని పేర్కొన్నారు. ఏండ్లుగా నలుగుతున్న వివాదాలను పరిష్కరించడమే నూతన బిల్లు ప్రధాన లక్ష్యమని, అన్ని పార్టీలు సహకరించాలని కోరారు.   

ప్రతిపక్షాల ఆరోపణలపై స్పందిస్తూ.. కేంద్రం 2013లో బిల్లును రూపొందించేముందు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను సంప్రదించింది. గత ప్రభుత్వం ముసాయిదా బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపింది. బిల్లుకు తుదిరూపు ఇచ్చేముందు వివిధ మార్గాల ద్వారా వచ్చిన సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్నది అని స్పష్టంచేశారు. అయితే 16వ లోక్‌సభ గడువు ముగిసిపోవడంతో బిల్లు రద్దయిందని, ఈ నేపథ్యంలో బిల్లును మరోసారి ప్రవేశపెడుతున్నామని చెప్పారు. 

ప్రపంచ జనాభాలో భారతదేశ వాటా 18శాతంగా ఉన్నదని, కానీ తాగునీటి లభ్యత ప్రపంచ సగటుతో పోల్చితే నాలుగు శాతం మాత్రమే ఉన్నదని చెప్పారు. వాతావరణ మార్పు ల ఫలితంగా జల వివాదాలు పెరుగుతున్నాయి. నీళ్లను కొలిచి వాడుకోవాల్సిన రోజులు వస్తాయి. కాబట్టి వీలైనంత త్వరగా రాష్ట్రాల వాటాలను చట్టబద్ధంగా తేల్చాల్సిన అవసరం ఉన్నది. అదే సమయంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి. 2050 నాటి అవసరాలకు అనుగుణంగా ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అని పేర్కొన్నారు. 

తాజా చట్టం ప్రకారం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ట్రిబ్యునల్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అవసరాన్ని బట్టి బెంచ్‌లను ఏర్పాటుచేస్తారు. ఒక్కో బెంచ్‌కు ఒక్కో బాధ్యతను అప్పగిస్తారు. ఇందులో విశ్రాంత న్యాయమూర్తులను, సాగునీటి రంగ నిపుణులను సభ్యులుగా తీసుకుంటారు. వివాదం పరిష్కారం కాగానే ఆ బెంచ్ రద్దవుతుంది. ఒక వివాదానికి సంబంధించి ట్రిబ్యునల్ గరిష్ఠంగా రెండేండ్లలో తీర్పును వెలువరించాలి. తీర్పు వెలువడిన వెంటనే వాటాలను నిర్ణయిస్తూ నోటిఫికేషన్ విడుదలవుతుంది. 

ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ముందుగా రాష్ట్ర ప్రభుత్వాలు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలంటూ కేంద్రాన్ని కోరాలి. కేంద్రం అవసరం అనుకుంటే ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం దేశంలో నదీజల వివాదాలకు సంబంధించి తొమ్మిది ట్రిబ్యునళ్లు ఉన్నాయి. కృష్ణా, కావేరి, మహాదాయి, రావి, బియాస్ తదితర ట్రిబ్యునళ్లు ఉన్నాయి.