కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా విశ్వేశ్వర హెగ్డే

కర్ణాటక శాసనసభ నూతన స్పీకర్‌గా బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే విశ్వేశ్వర హెగ్డే కాగేరి ఎన్నికయ్యారు. బీజేపీ తరపున కాగేరి ఒక్కరే నామినేషన్‌ వేయడంతో స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. శాసనసభలో తగిన సంఖ్యాబలం లేకపోవడంతో స్పీకర్‌ పదవికి కాంగ్రెస్‌, జేడీఎస్‌లు పోటీ చేయలేదు. నూతన స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియను బుధవారం శాసనసభలో డిప్యూటీ స్పీకర్‌ కృష్ణారెడ్డి నిర్వహించారు. స్పీకర్‌ ఎన్నికయ్యాక ఆయన కూడా తన పదవికి రాజీనామా చేశారు.

కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణంలోని కుమారస్వామి ప్రభుత్వం మెజారిటీ లేక విశ్వాసపరీక్షలో ఓడిపోవడంతో బీజేపీ పక్ష నేత యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన రమేష్ కుమార్ స్పీకర్ పదవికి వెంటనే రాజీనామా చేసేశారు.

స్పీకర్‌ పదవికి తొలుత ముఖ్యమంత్రి యడియూరప్ప మాజీ సీఎం జగదీశ్‌ శెట్టర్‌ పేరును ప్రతిపాదించారు. ఇందుకు ఆయన ససేమిరా అనడంతో కె.జి.బోపయ్యతో మంగళవారం నామినేషన్‌ వేయించాలని నిర్ణయించుకున్నారు. సోమవారం రాత్రి పొద్దుపోయేంతవరకు స్పీకర్‌ పదవికి బోపయ్య పేరే గట్టిగా వినిపించింది. అయితే చివరిక్షణంలో బీజేపీ అధిష్ఠానం రంగంలోకి దిగి బోపయ్య స్థానంలో విశ్వేశ్వరహెగ్డే కాగేరి పేరును ఖరారు చేసింది.

బోపయ్య గతంలో స్పీకర్‌గా పనిచేసిన సమయంలో పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం, సుప్రీంకోర్టు అక్షింతలు వేయడం తెలిసిందే. అందుకు స్పీకర్‌ పదవిలో మచ్చలేని, అన్ని పార్టీల నాయకులను కలుపుకుపోయే స్వభావం ఉన్న విశ్వేశ్వరహెగ్డే కాగేరివైపే అధిష్ఠానం మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.

 

ఉత్తరకన్నడ జిల్లా అంకోలాకు చెందిన విశ్వేశ్వరహెగ్డే కాగేరి ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం కలిగినవారు. 1961 జూలై 10న జన్మించిన కాగేరి వాణిజ్య, న్యాయశాస్త్రాలలో పట్టాలు పుచ్చుకున్నారు. ఉత్తరకన్నడజిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా సేవలందించారు.

తొలిసారి 2008లో శిరసి-సిద్దాపుర శాసనసభ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై గెలుపొందారు. అనంతరం 2013, 2018లలోనూ ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. కాగా 1994 నుంచి వరుసగా మూడుసార్లు అంకోలా నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై గెలుపొందారు. 2006-07లో అప్పటి సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పార్లమెంటరీ కార్యదర్శిగా పనిచేశారు. 2008లో యడియూరప్ప కేబినెట్‌లో ప్రాథమిక విద్యాశాఖమంత్రిగా, ఉత్తర కన్నడ జిల్లా ఇన్‌చార్జ్‌మంత్రిగా సేవలందించారు.