ప్రజలపై రూ. 6013 కోట్ల విద్యుత భారం !

పాత నష్టాల భర్తీ పేరుతో ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల భారం వేసేందుకు జగన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మూడేళ్ల నష్టాలకు సంబందించి రూ. 6013 కోట్ల నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని తాజాగా ఎపిఇఆర్‌సికి ఇంధనశాఖ ప్రతిపాదించింది. ఈ మొత్తాన్ని ఛార్జీల రూపంలో వసూలు చేసుకునేందుకు  అనుమతివ్వాలని కోరింది. దీనిపై వచ్చే నెల 17వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేందుకు ఇఆర్‌సి నిర్ణయించింది. ఆ తరువాతే ఎంత టారిఫ్ ను అనుమతిస్తారన్నది తేలుతుందని చెబుతున్నారు.

తాజాగా ఇఆర్‌సికి సమర్పించిన ప్రతిపాదనల్లో 2014-15 ఆర్ధిక సంవత్సరానికి సంబందించి రూ.861 కోట్లు, 2016-17లో విద్యుత్‌ కొనుగోళ్ల ద్వారా వచ్చిన నష్టం రూ 2,580 కోట్లు, 2017-18లో విద్యుత్‌ కొనుగోళ్ల నష్టం రూ 2,576 కోట్లను భర్తీ చేసుకునేందుకు అనుమతి కోరింది. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.
ప్రధానంగా అధిక ధరకు ప్రైవేటు విద్యుదుత్పత్తి సంస్థల నుండి కొనుగోలు చేసి ఆ భారాన్ని ట్రూఅప్‌ పేరిట ప్రజలపై వేస్తున్నారు.

రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ను ఎక్కువగా చూపడం, జెన్‌కో ఉత్పత్తిని తక్కువగా పేర్కొనడం చాలా కాలంగా జరుగుతున్న తంతే. అంతేగాక పవర్‌ ఎక్స్‌ఛేంజి కొనుగోళ్లలోనూ అనేక గోల్‌మాల్స్‌ జరుగుతున్నాయి. పీక్‌ అవర్స్‌లో లోటు చూపించి, భారీ ధరలకు కొంటుంటారు. ఇవి, ఇలాంటి అంశాలు ఇఆర్‌సి చేపట్టే పబ్లిక్‌ హియరింగ్‌లో నిపుణులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు లేవనెత్తుతారు.

డిస్కామ్‌లు ఏం చెబుతాయో చూడాలి. గతంలో ఒకసారి రెండు వేల కోట్లకు డిస్కామ్‌లు ట్రూఅప్‌ ప్రతిపాదనలు పెట్టగా, ఇఆర్‌సి రూ 700 కోట్లకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు కూడా ఆరువేల కోట్ల ప్రతిపాదనలో ఎరతో కొంత ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు ఒక అధికారి పేర్కొన్నారు.