సిట్టింగ్‌ జడ్జ్‌పై సీబీఐ విచారణకు సీజేఐ అనుమతి

అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్ఎన్ శుక్లాపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అనుమతించారు. శుక్లాపై గతకొంత కాలంగా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. జస్టిస్ శుక్లాపై 2017-2018 విద్యా సంవత్సరంలో ప్రైవేటు మెడికల్‌ కళాశాలల్లో అడ్మిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను లెక్కచేయకుండా ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అయితే సిట్టింగ్‌ జడ్జ్‌పై సీబీఐ విచారణ చేపట్టాలంటే దానికి సీజేఐ అనుమతి త‍ప్పని సరి. ఈ నేపథ్యంలో ఆయనపై విచారణకు ఆదేశించాలని సీబీఐ ప్రత్యేక దర్యాప్తు అధికారి ప్రధాన న్యాయమూర్తిని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన గొగోయ్‌ శుక్లాపై విచారణకు అనుమతిస్తున్నట్లు తెలిపారు.

ఓ సిట్టింగ్‌ న్యాయమూర్తిపై సీబీఐ విచారణ చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న శుక్లాను తొలగించాలని జస్టిస్ రంజన్ గొగోయ్ ఇదివరకే కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అంతర్గత విచారణలో జస్టిస్ శుక్లా దుష్ప్రవర్తన రుజువైందని లేఖలో పేర్కొన్నారు. అందువల్ల ఆయన్ను తొలగించాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ప్రైవేటు మెడికల్‌ కళాశాల అడ్మిషన్లలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. 

గతంలో దీనికి సంబంధించి ఆయనపై కేసు నమోదైందయినట్లు కూడా సీజే గుర్తుచేశారు. ఇదిలావుండగా.. జస్టిస్ శుక్లాపై ఆరోపణల నేపథ్యంలో మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌కే అగ్నిహోత్రి, మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీకే జైస్వాల్‌లతో అంతర్గత కమిటీ ఏర్పాటైంది.

జస్టిస్‌ శుక్లాపై వచ్చిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని కమిటీ తన విచారణ నివేదికలో స్పష్టం చేసింది. దీంతో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా స్పందిస్తూ జస్టిస్‌ శుక్లా రాజీనామా చేయాలని, లేదంటే స్వచ్ఛంద పదవీవిరమణను ఎంచుకోవచ్చని సూచించారు. తాజాగా సీజే ఆదేశాలతో ఆయన సీబీఐ విచారణకు తప్పనిసరిగా హాజరుకావాల్సింది.