ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అధికారం స్పీకర్లదే!

ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేందుకు స్పీకర్‌కు ఉన్న అధికారాన్ని లాగేసుకునే సాహసం తామెందుకు చేయాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద రాజ్యాంగమే ఆ అధికారాన్ని శాసనసభ స్పీకర్‌లకు ఇచ్చిందని తెలిపింది. తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం సహా 11 మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్‌ చేస్తూ డీఎంకే నేత చక్రపాణి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం..‘రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ప్రకారం ఫిరాయింపులకు పాల్పడిన వారిని అనర్హులుగా ప్రకటించే అధికారం స్పీకర్‌కు ఉంది. ఈ అధికారాన్ని న్యాయస్థానం ఎలా తీసుకుంటుంది’ అని ప్రశ్నించింది.

అనర్హతపై అసెంబ్లీ స్పీకర్‌ నిర్ణయం తీసుకోని పరిస్థితుల్లో కోర్టులే నిర్ణయించాలంటూ పిటిషనర్‌ తరఫున సీనియర్‌ లాయర్‌ కపిల్‌ సిబల్‌ వాదించగా కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేసింది. గత ఏడాది విశ్వాస పరీక్ష సందర్భంగా సీఎం పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన పన్నీరుసెల్వంతోపాటు మరో 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని చక్రపాణి తన పిటిషన్‌లో కోరారు.