రాష్ట్రపతి పాలనపై వివక్షలకు స్పందించని గవర్నర్

ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కె చంద్రశేఖరరావును కొనసాగించొద్దని, తెలంగాణలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలంటే రాష్ట్ర పతి పాలన విధించాలని గవర్నర్‌ను విపక్షాలు డిమాండ్ చేసాయి. కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్‌, టీడీపీ పార్టీల నాయకులు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. అయితే ఈ విషయమై ఆయన నుండి తగు స్పందన లభించక పోవడంతో నిరాశ చెంది, రాష్ట్రపతిని కలసి ఆయన ముందు తమ డిమాండ్ ఉంచాలని భావిస్తున్నారు.

 ప్రధాని మోడీ, కేసీఆర్, ఎన్నికల కమిషన్ కలిసి తెలంగాణ ప్రజల హక్కును కాలరాసేలా నిర్ణయం తీసుకున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా విమర్శించారు. ఎన్నికలు ఎలా జరగాలో కూడా కేసీఆర్‌ ముందే షెడ్యూల్ విడుదల చేశారని గుర్తు చేసారు. ఓటర్ లిస్టులో 20 లక్షల ఓట్లు తగ్గించి వాటిని సవరించకుండా ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. 

ఈ నెల 6న గవర్నర్‌ను కలిసిన తరువాత కేసీఆర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌తో మాట్లాడాను అని చెప్పారని, ఆన్ రికార్డ్ ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మతో కూడా మాట్లాడానని చెప్పారని గుర్తు చేసారు. టీఆర్‌ఎస్ పార్టీ తరపున రాజీవ్ శర్మ ఎన్నికల కమిషన్‌ను ఎలా కలుస్తారు, ఆయన ఏమైనా బ్రోకరా అంటూ నిప్పులు చెరిగారు. తమ పార్టీకి చెందిన మాజీ ఎమ్యెల్యే జగ్గారెడ్డిని అక్రమంగా అరెస్ట్‌ చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసీఆర్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ప్రస్తుతం ఉన్న ఆపద్ధర్మ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తుందని గవర్నర్‌ను కలిశామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండ రామ్‌ ఫిర్యాదు చేసారు. ఓటర్ల పేర్లు పెద్ద సంఖ్యలో ఓటర్ లిస్ట్‌లో గల్లంతయ్యాయని విమర్శించారు. వినాయక చవితి, దసరా పండుగలలో ప్రజలు బిజీగా ఉంటారు అందువల్ల ఓటరు నమోదు కార్యక్రమం సరిగా జరిగే అవకాశం లేదని పేర్కొన్నారు.

తెలంగాణలోని రాజ్యాంగ సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని ఇష్టానుసారంగా కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారని టీటీడీపీ అధ్యక్ష్యుడు ఎల్‌ రమణ ద్వజమెత్తారు. ఎన్నికల సంఘాన్ని సంప్రదించామని కేసీఆర్ చెప్పడం చూస్తే కేంద్రంతో కుమ్మక్కై,రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపించారు.టీజేఎస్, సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ అన్ని పార్టీలు కలిసి రాష్ట్రపతిని కలిసి రాష్ట్రపతి పాలనను విధించమని కోరుతామని పేర్కొన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగడానికి వీలు లేదని స్పష్టం చేసారు.

తెలంగాణలో రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగుతుందని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కలిసి 100 సీట్లు గెలుస్తామంటున్నారని, మోదీతో కలిసి ఎన్నికల షెడ్యూల్ కూడా కేసీఆర్ ఎలా ప్రకటించారని ప్రశ్నించారు. కేసీఆర్‌పై ఫిర్యాదు చేస్తే గవర్నర్ ఏమాత్రం స్పందించలేదని విచారం వ్యక్తం చేసారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర పతికి కూడా ఫిర్యాదు చేస్తామని స్పష్తం చేసారు.