చారిత్రక తప్పిదాన్ని పార్లమెంటు సరిదిద్దింది


తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుస ట్వీట్లలో స్పందించారు. ముస్లిం మహిళలకు జరిగిన చారిత్రక తప్పిదాన్ని పార్లమెంటు సరిదిద్దిందని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వానికి ఇది దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

‘‘పురాతన, మధ్య యుగాలనాటి ఆచారం చివరికి చరిత్ర చెత్త కుండీకి పరిమితమైంది! ట్రిపుల్ తలాక్‌ను పార్లమెంటు రద్దు చేసి, ముస్లిం మహిలలకు జరిగిన చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దింది. ఇది స్త్రీ, పురుష సమానత్వం సాధించిన విజయం, సమాజంలో సమానత్వానికి దోహదపడుతుంది. నేడు భారత దేశం సంతోషిస్తోంది’’ అని మోదీ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘‘ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు, 2019 ఆమోదానికి పార్లమెంటు ఉభయ సభల్లోనూ మద్దతిచ్చిన అన్ని పార్టీలు, ఎంపీలకు ధన్యవాదాలు చెప్తున్నాను. సందర్భానికి తగిన విధంగా వారు వ్యవహరించారు. భారత దేశ చరిత్రలో నేడు వారు తీసుకున్న చర్య ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అని మరో ట్వీట్‌లో మోదీ పేర్కొన్నారు.

‘‘ట్రిపుల్ తలాక్‌ ఆచారం వల్ల గొప్ప తప్పిదాల కారణంగా బాధపడిన ముస్లిం మహిళల ధైర్యసాహసాలకు వందనం చేయవలసిన సందర్భమిది. ట్రిపుల్ తలాక్ రద్దు మహిళా సాధికారతకు దోహదపడుతుంది, అంతేకాకుండా మన సమాజంలో వారికి తగిన గౌరవ, మర్యాదలను ఇస్తుంది’’ అని పేర్కొన్నారు.

‘‘యావత్తు దేశానికి నేడు చారిత్రక దినం. నేడు కోట్లాది ముస్లిం తల్లులు, సోదరీమణులకు విజయం దక్కింది. గౌరవంగా జీవించే హక్కు వారికి లభించింది. ఎంతో కాలం నుంచి ట్రిపుల్ తలాక్ వల్ల బాధపడుతున్న ముస్లిం మహిళలకు నేడు న్యాయం దొరికింది’’ అని పేర్కొన్నారు.

కాగా, తక్షణ ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసే బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆ పార్టీ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా మోదీని అభినందించారు.

ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు ఆమోదం పొందడంతో తక్షణ ట్రిపుల్ తలాక్ తిరోగమన ఆచారం శాపం నుంచి ముస్లిం మహిళలు విముక్తులవుతారని అమిత్ షా ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ బిల్లును రాజ్యసభ ఆమోదం లభించిన ఈ రోజు దేశ ప్రజాస్వామ్యంలో గొప్ప శుభ దినమని పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అభినందించారు. 

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇచ్చిన ఓ ట్వీట్‌లో నేడు ఓ చారిత్రక దినమని పేర్కొంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు. ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యాయానికి మోదీ ప్రభుత్వంలో తెరపడిందని తెలిపారు.