కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా విశ్వేశ్వర్‌ హెగ్దే కగేరి

కర్ణాటక అసెంబ్లీ నూతన స్పీకర్‌గా బిజెపి ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌ హెగ్దే కగేరి నియామకం దాదాపు ఖరారు అయ్యింది. విశ్వాస పరీక్షలో నెగ్గి యడియూరప్ప నాయకత్వంలో కర్ణాటకలో బీజేపీ తమ ప్రభుత్వాన్ని కొన్నిరోజుల క్రితమే ఏర్పాటు చేసింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య ప్రస్తుత స్పీకర్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కె.ఆర్‌ రమేశ్‌కుమార్‌ సోమవారం స్పీకర్‌ పదవికి రాజీనామా చేశారు. 

ఈ నేపథ్యంలో మంగళవారం కగేరి స్పీకర్‌ అభ్యర్థిగా తన నామపత్రాలను అసెంబ్లీ కార్యదర్శి ఎం.కె వరలక్ష్మికి సమర్పించారు. ఆయనతోపాటు సీఎం యడియూరప్ప, బిజెపి ప్రజాప్రతినిధులు గోవింద్‌ కజ్రోల్‌, ఆర్‌ అశోక్‌, జగదీశ్‌షెట్టర్‌, కేఎస్‌ ఈశ్వరప్ప, సురేశ్‌కుమార్‌ ఉన్నారు. స్పీకర్‌ అభ్యర్థిగా కగేరి ఒక్కరే నామపత్రాలను సమర్పించడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. 

అయితే ఈ విషయాన్ని అసెంబ్లీ కార్యాలయ వర్గాలు అధికారికంగా బుధవారం ప్రకటించనున్నాయి. కగేరి ప్రారంభదశలో సంఘ్‌పరివార్‌లో భాగమైన అఖిల భారత విద్యా పరిషత్‌ విద్యార్థి సంఘంలో సభ్యునిగా ఉన్నారు. అ తర్వాత 1994 నుంచి వరుసగా ఆరు సార్లు అంకోలా అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో బీజేపీ ప్రభుత్వం హయాంలో కగేరి ఉన్నత విద్యాశాఖమంత్రిగా కూడా పనిచేశారు.