ఉన్నావ్ లైంగికదాడి కేసులో బిజెపి ఎమ్యెల్యేపై హత్య కేసు

ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నావ్ లైంగికదాడి కేసు లో ఆరోపణలెదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెన్‌గర్‌తోపాటు మరో 9 మందిపై ఆ రాష్ట్ర పోలీసులు సోమవారం హత్యతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. ఆదివారం బాధితురాలు తన బంధువులు, న్యాయవాదితో కలిసి ప్రయాణిస్తున్న కారును ఓ లారీ ఢీకొనడంతో బాధితురాలి బంధువులైన ఇద్దరు మహిళలు మరణించా రు. 

తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు, ఆమె న్యాయవాది మహేంద్ర సింగ్.. లక్నో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఢిల్లీ మహిళాకమిషన్ చైర్‌పర్సన్ స్వాతి సోమవారం వారిని పరామర్శించారు. బాధితురాలి కుటుంబంతోపాటు విపక్షాలు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేశాయి. ఇది సోమవారం పార్లమెంట్‌ను కుదిపేసింది. 

లారీ అతివేగం, వర్షం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నట్లు డీజీపీ ఓపీ సింగ్ తెలిపారు. సీబీఐ దర్యాప్తుపై బాధిత కుటుంబం ఫిర్యాదును సర్కార్‌కు నివేదించినట్లు చెప్పారు. ఇది తమ కుటుంబం అంతా నికి జరిగిన కుట్ర అని, తమను చంపుతామని ఎమ్మెల్యే అనుచరులు ఇటీవల బెదిరించినట్లు బాధితురాలి తల్లి తెలిపారు. 

ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు ప్రమాద కారణమైన లారీ నంబర్ ప్లేట్‌కు నల్లరంగు పూయడం గమనించారు. ఫతేపూర్‌కు చెందిన లారీ నంబర్ యూపీ 71 ఏటీ 8300గా గుర్తించారు. దీన్ని ఫోరెన్సిక్ విభాగానికి పంపిస్తామని లక్నో జోన్ ఏడీజీ రాజీవ్ కృష్ణ చెప్పారు.