నిరర్ధక ఆస్తులు పెరగడానికి కాంగ్రెస్సే కారణం

దేశంలో నిరర్థక ఆస్తులు పెరగడానికి, బ్యాంకింగ్ వ్యవస్థ ఖాయిలా పడడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని కేంద్ర మంత్రి స్మ్రితి ఇరాని నిశితంగా విమర్శించారు.  యుపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థ మూలాలను తీవ్రంగా దెబ్బతీసిందని ఆమె ఆరోపించారు.

రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ తాజాగా వెల్లడించిన అంశాలను ఇరానీ ప్రస్తావిస్తూ 2006-08 మధ్య కాలంలో యూపీఏ ప్రభుత్వ తీరు వల్ల భారతీయ బ్యాంకింగ్ రంగంలో నిరర్థక ఆస్తులు గణనీయంగా పెరిగాయని తెలిపారు. కాంగ్రెస్ తప్పుడు పరిపాలన వల్లే దేశంలో మొండి బాకీలు, తిరిగి రాని రుణాలు పెరిగాయని పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును నాశనం చేయాలని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ వాంఛించినట్లు ఆరోపించారు.

నేషనల్ హెరాల్డ్ కేసును ప్రస్తావిస్తూ యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కాంగ్రెస్ అద్యక్షుడు  రాహుల్ గాంధీ నిధులను దుర్వినియోగం చేశారని, ఆయన దీనికి సమాధానం చెప్పాలని స్మృతి ఇరానీ డిమాండ్ చేశారు. 2011-12 ఆర్థిక సంవత్సరపు పన్ను మదింపును మరోసారి పరిశీలించేందుకు ఆదాయపు పన్ను శాఖ ప్రతిపాదించిందని, ఈ నేపథ్యంలో ఇచ్చిన నోటీసుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు సోమవారం తోసిపుచ్చిందని గుర్తు చేశారు.

కాంగ్రెస్ అవినీతి హవాను ఢిల్లీ హైకోర్టు, రఘురాం రాజన్ సోమవారం మరోసారి వెల్లడించినట్లు ఇరానీ పేర్కొన్నారు. ముఖ్యంగా రాహుల్, సోనియా, ప్రియాంక గాంధీల అవినీతికి మరో ఉదాహరణను వివరించినట్లు తెలిపారు. యంగ్ ఇండియన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రాహుల్ గాంధీకి చెందినదని, కాంగ్రెస్‌ది కాదని, అందువల్ల తాను రాహుల్‌ను ప్రశ్నిస్తున్నానని ఆమె స్పష్టం చేసారు.

లాభ, నష్టాల మీద తనకు ఆసక్తి లేదని రాహుల్ అంటున్నారని, అదే నిజమైతే వాణిజ్య ప్రయోజనాలు ఉన్న కంపెనీని ఎందుకు కొన్నారని ఆమె ప్రశ్నించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కౌగిలించుకోవడానికి ఆత్రుతపడిన రాహుల్ గాంధీ ఆదాయపు పన్ను అధికారి విషయంలో ఆమడ దూరం ఎందుకు పారిపోతున్నారని ఇరానీ నిలదీశారు.