పులులకు అత్యంత సురక్షిత ఆవాసంగా భారత్‌

మన జాతీయ జంతువైన పులికి ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ఆవాసంగా భారత్‌ మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఈ రోజు అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆల్‌ ఇండియా టైగర్‌ ఎస్టిమేషన్ 2018 నివేదికను మోదీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పులుల సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. 

‘2014లో దేశంలో 2,226 పులులు ఉండేవి. 2018 నాటికి వాటి సంఖ్య 2,967కు చేరింది. 2022 నాటికి పులుల సంఖ్యను రెట్టింపు చేయాలని 9ఏళ్ల క్రితం లక్ష్యంగా పెట్టుకున్నాం.  మరో నాలుగేళ్లు ఉండగానే ఆ లక్ష్యాన్ని చేరుకున్నాం. ఈ నివేదిక ప్రతి భారతీయుడికి, ప్రతి ప్రకృతి ప్రేమికుడికి ఎంతో ఆనందాన్నిస్తుంది. ఈ ఐదేళ్లలో పులల సంరక్షణ కేంద్రాలు 692 నుంచి 860కి పెరిగాయి. కమ్యూనిటీ రిజర్వ్‌లు 43 నుంచి 100కి పైగా పెరిగాయి. ప్రపంచంలోనే పులులకు అత్యంత సురక్షితమైన ఆవాసంగా భారత్‌ మారింది’ అని మోదీ తెలిపారు. 

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ సినిమా పేర్లను ప్రస్తావిస్తూ ‘‘ఏక్తా టైగర్‌’తో కథ ప్రారంభమై ‘టైగర్‌ జిందా హై’కి చేరింది. అయితే ఇక్కడితో ఆగిపోదు’ అని మోదీ చెప్పుకొచ్చారు. ఆల్‌ ఇండియా టైగర్‌ ఎస్టిమేషన్‌ పేరుతో ప్రతి నాలుగేళ్లకోసారి పులుల సంఖ్యపై ప్రభుత్వం నివేదిక విడుదల చేస్తోంది. 2006లో దీన్ని ప్రారంభించగా.. 2010, 2014లో నివేదిక విడుదల చేసింది. 

కాగా, గడిచిన ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా అడవుల విస్తీర్ణం పెరిగిందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ తెలిపారు. 2015-2017 మధ్య సుమారు 8,000 చదరపు కిలోమీటర్ల మేర అటవి విస్తీర్ణం పెరిగిందని ఆయన ప్రకటించారు. శాటిలైట్ల ద్వారా అడవీ విస్తీర్ణాన్ని అంచనా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా పులుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిందని ఆయన చెప్పారు. గడిచిన ఐదేళ్లో 3 వేల సమీప సంఖ్యకు పులులు పెరిగాయని పేర్కొన్నారు.

‘‘2014 నుంచి 2019 వరకు దేశంలో 16,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవి విస్తరించింది. ఇక అడవుల్లో వన్యప్రాణులు కూడా పెద్ద సంఖ్యలో పెరిగాయి. ముఖ్యంగా జాతీయ జంతువు పులుల సంఖ్య రెండు రెట్లు పెరిగాయి. 2014లో 1,400 పులులు మాత్రమే ఉండేవి. ఐదేళ్లలో ఈ సంఖ్య రెట్టింపైంది. ప్రస్తుతం పులుల సంఖ్య 2,967. ఇది హర్షించదగ్గ విషయం’’ అని జావడేకర్ పేర్కొన్నారు.