స్పీకర్‌ పదవికి రమేష్ కుమార్ రాజీనామా

కర్నాటక విధాన సభ స్పీకర్ పదవికి రమేష్ కుమార్ రాజీనామా చేశారు. విశ్వాస పరీక్షలో బీజేపీ నెగ్గడం, రమేష్ కుమార్ కాంగ్రెస్ ప్రతిపాదించిన స్పీకర్ కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా తాను ఏవైనా పొరపాట్లు చేసిఉంటే క్షమించమని కోరారు.

విశ్వాస పరీక్షలో బీజేపీ నెగ్గిన అనంతరం స్పీకర్ రమేష్ కుమార్ వీడ్కోలు ప్రసంగం చేశారు. 17 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన స్పీకర్‌గా రమేష్ వార్తల్లో నిలిచారు.

దేశంలో అవినీతికి మూలకారణం ఎన్నికలు అని చెబుతూ ఎన్నికల సంస్కరణలు చేపట్టకుండా అవినీతిని తుదముట్టించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల సంక్షరణలకు ఆర్ధిక వనరుల అవసరం లేదని, హృదయం ఉంటె సరిపోతుందని తెలిపారు.

రమేష్ కుమార్ రాజీనామా చేయడంతో కొత్త స్పీకర్ ఎవరనే ఆసక్తి ఇరు పార్టీల్లో నెలకొంది. బీజేపీలో చాలామంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉండటంతో ఏ సీనియర్ ఎమ్మెల్యేకు ఆ అవకాశం దక్కుతుందోనన్న ఆసక్తి నెలకొంది.