విశ్వాసపరీక్షలో నెగ్గిన యడియూరప్ప

కర్ణాటకలో  యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. మూజువాణి ఓటుతో బీఎస్ యడియూరప్ప ఈ పరీక్షలో విజయం సాధించారు. బీజేపీకి మద్దతుగా 106 (బీజేపీ 105, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే), కాంగ్రెస్-జేడీఎస్‌కు మద్దతుగా 99 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. సొంత పార్టీ బలం 105తో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతివ్వడంతో యడ్డీ విజయం లాంఛనమైంది.

రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసినప్పటికీ బీజేపీకి ఎలాంటి నష్టం కలగలేదు. రెబల్ ఎమ్మెల్యేలపై వేటుతో మేజిక్ ఫిగర్ 104కు పడిపోయింది. ఈ పరిణామం కూడా బీజేపీకి కలిసొచ్చింది. బీజేపీకి సొంతంగానే 105 మంది ఎమ్మెల్యేల బలం ఉండటంతో విశ్వాస పరీక్షలో సునాయాసంగా నెగ్గింది. బీజేపీ సీఎంగా యడియూరప్ప పాలన సాగించనున్నారు.

అంతకు ముందు సీఎం యడ్యూరప్ప ప్రధాని నరేంద్ర మోదీ అడుగుజాడల్లో రైతులకు సాయం చేస్తానని  ప్రకటించారు. రైతులకు రెండు విడతలుగా ఆర్థిక సాయం అందజేస్తామని సీఎం తెలిపారు. రైతులు తమకు ఆప్త మిత్రులని, ఈ విషయం ఇప్పటికే పలుమార్లు రుజువైందని సీఎం పేర్కొన్నారు. 

కర్నాటకలో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి నేటితో తెరపడినట్టయింది. విశ్వాస పరీక్షలో నెగ్గిన యడియూరప్ప ప్రభుత్వం స్పీకర్‌గా రమేష్ కుమార్‌ను కొనసాగిస్తుందా లేక కొత్త స్పీకర్‌ను నియమించుకుంటుందా అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గడంతో మంత్రి వర్గ ఏర్పాటుపై యడియూరప్ప దృష్టి సారించనున్నారు.