కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో రూ 200 కోట్ల విదేశీ ఆస్తులు

ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసంలో ఐటీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించి భారీగా విదేశీ ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు చెందిన 13 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి రూ.200 కోట్ల విదేశీ ఆస్తులు జప్తు చేశారు. ఈ నెల 23న హర్యానా ఎమ్మెల్యే కుల్దీప్ బిష్నోయ్ సహా ఆయన కుటుంబ సభ్యుల నివాసాల్లో సోదాలు జరిగాయి.

హర్యానా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు జరిగినట్టు ఆధారాలున్నాయని ఐటీ శాఖ చెబుతోంది. దాదాపు రూ.30 కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ఆరోపిస్తోంది.

‘‘ పొరుగు రాష్ట్రంలో రాజకీయ ప్రాబల్యం ఉన్న వారు, పదవుల్లో ఉన్నవారు కొన్ని దశాబ్దాలుగా పెద్ద ఎత్తున అప్రకటిత ఆదాయం సమకూర్చుకుంటున్నారు. స్థిరాస్తి లావాదేవీలు, నిర్మాణాలు సహా ఇతర రూపాల్లో భారీ మొత్తంలో నగదు అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి...’’ అని ఐటీ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఈ ప్రకటనలో ఐటీ శాఖ ఏ పేరూ ప్రస్తావించపోయినప్పటికీ.. హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ కుమారుడు కుల్దీప్ బిష్నోయ్ కేసు గురించేనని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. కాగా పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం నిందితులు నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీలతో కుల్దీప్‌కు సంబంధాలున్నాయా అన్న కోణంలో కూడా అధికారులు విచారణ జరుపుతుండడం గమనార్హం. కుల్దీప్ ప్రస్తుతం హర్యానాలోని ఆదంపూర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.