‘హోదా’ సాంకేతికంగా సాధ్యం కాదు

ఏపీకి ప్రత్యేక హోదా సాంకేతికంగా సాధ్యం కాదని, ఆ విషయాన్ని నీతి ఆయోగ్ మార్గదర్శకాల్లో కూడా సవివరంగా తెలిపిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అనంతపురంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయ క్షీణత 32 శాతం నుంచి 42 శాతానికి పెరగడమే కాకుండా, హోదాపై నీతి ఆయోగ్ మార్గదర్శకాల్లో కూడా సవివరంగా తెలుపుతూ హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదించిందని గుర్తు చేశారు.

అయితే ఈ విషయం తెలిసినప్పటికీ మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు బీజేపీ పరువు తీయడానికి బహిరంగంగా తిట్టడమే పనిగా ఎంచుకున్నారని విమర్శించారు. అంతేకాకుండా ప్రత్యేక హోదా డిమాండ్‌తో శివాజీ రాజా, చలసాని శ్రీనివాస్ వంటి కొందరు ట్రబుల్ క్రియేటర్స్‌ను చంద్రబాబు ఎంచుకున్నారని, తద్వారా హోదా సమస్యపై సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వేసిన ఉచ్చులో పడ్డారని ఆరోపించారు.

అలాగే ప్రత్యేక హోదా కింద రాష్ట్రాలకు రూ. 5వేల కోట్లు తెచ్చుకునే వెసులుబాటు ఉంటే, ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ. 16వేల కోట్లు కేటాయించేందుకు హామీ ఇచ్చిందని చెప్పారు. కాగా అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు రూ. 960 కోట్లు కేటాయించిందన్నారు. అయితే అప్పటి సీఎం చంద్రబాబు జిల్లా కేంద్రం సమీపంలోని బుక్కరాయసముద్రం మండల పరిధిలో ఆమోదయోగ్యమైన భూమిని కేటాయించలేదని, అలాగే ఇచ్చిన నిధులను వినియోగించుకోలేదని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థలను అభివృద్ధి చేస్తే బీజేపీకి మంచి పేరొస్తుందన్న భయంతో టీడీపీ ప్రభుత్వం మొదటి నుంచే సహకరించలేదని విమర్శించారు. ప్రస్తుత బడ్జెట్‌లో కేంద్రం కేవలం రూ. 10 కోట్లు మాత్రమే కేటాయించడంపై వివరణ ఇస్తూ ఆ మొత్తం హెడ్ ఆఫ్ అకౌంట్ ప్రారంభించేందుకే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి, నీటి వసతిని సమకూర్చేందుకు సహకరించినట్లయితే ఆ నిధులను ఖర్చు చేయవచ్చని చెప్పారు.
మరో రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా తమ కార్యకలాపాలను ప్రారంభించడంలో జాప్యం జరగడానికి కూడా చంద్రబాబు వివాదాస్పద భూమిని కేటాయించడమే కారణమని వ్యాఖ్యానించారు.

అలాగే సెంట్రల్ వర్సిటీ విషయంలో కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్రంలో అవాంచనీయమైన వాతావారణాన్ని సృష్టిస్తున్నాయని ధ్వజమెత్తారు. గతంలో టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సి ఉండగా ఇప్పుడు పని గట్టుకుని వరుస ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు.