యుపి బీజేపీలోకి కాంగ్రెస్ కుటుంబాల వలస!

ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ ను పునరుద్దరించాలని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎంతగా ప్రయాసపడుతున్నా తొలినుండి కాంగ్రెస్ తో అనుబంధం గల కుటుంబాలు సహితం ఆ పార్టీకి దూరం అవుతున్నాయి. ఇప్పుడు వారంతా బిజెపి వైపు చూస్తున్నారు. బీజేపీలో ప్రాధాన్యత కూడా పొందుతున్నారు. 

తాజాగా ఉత్తర ప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా నియమితులైన స్వతంత్ర దేవ్ సింగ్ సహితం కాంగ్రెస్ కుటుంభానికి చెందినవారే. వాస్తవానికి ఆయన తల్లితండ్రులు ఆయనను `కాంగ్రెస్ సింగ్' అని పిలిచేవారు. ఆ పేరుతోనే ఆయన ప్రఖ్యాతి పొందారు. అయితే ఇప్పుడు ఆయన `కాంగ్రెస్' పదాన్ని విడిచిపెట్టారు. 

దిగవంత ప్రధాన మంత్రి లాల్ బహదూర్ సింగ్ మనవడు సిద్ధర్థ్ నాథ్ సింగ్ ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో ఉన్నారు. ఆయన గతంలో తెలుగు రాష్ట్రాల బిజెపి ఇన్ ఛార్జ్ గా కూడా పనిచేశారు. మరో కాంగ్రెస్ అగ్రనాయకుడు, మాజీ ముఖ్యమంత్రి హేమావతి నందన్ బహుగుణ కుమార్తె రీటా బహుగుణ ఇప్పుడు బిజెపి ఎంపీగా ఉన్నారు. 

ఇద్దరు కాంగ్రెస్ అగ్రనాయకులు - రాజేంద్ర కుమారి వాజపేయి, శ్యామ్ చరణ్ శుక్ల మనవడు హర్ష వర్ధన్ బాజపాయి ఇప్పుడు ప్రయాగరాజ్ నుండి బిజెపి ఎమ్యెల్యే. యుపి మరో మాజీ సీఎం వీర్ బహదూర్ సింగ్ కుమారుడు ఫతేహ్ బహదూర్ సింగ్ కూడా బిజెపి ఎమ్యెల్యే. ఆయన సీఎం ఆదిత్యనాథ్ కు చాలా ఇష్టుడిగా ప్రసిద్ధి పొందారు.