బుల్లెట్లు, బాంబుల కంటే కూడా అభివృద్ధే బలమైనది

కశ్మీర్‌లో ద్వేషాన్ని వ్యాప్తిచేయడానికి, అభివృద్ధికి ఆటంకాలు కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నవారు ఎప్పటికీ సఫలీకృతం కాలేరని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో బుల్లెట్లు, బాంబుల కంటే కూడా అభివృద్ధే బలమైనదని నిరూపితమైందని నొక్కి చెప్పారు. 

ఆదివారం మన్‌కీ బాత్ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్‌లో గతనెల నిర్వహించిన బ్యాక్ టు విలేజ్ కార్యక్రమంలో ప్రతిచోట స్థానికులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారని చెప్పారు. అభివృద్ధిలో కశ్మీర్ ప్రజలు సైతం భాగం కావడానికి సిద్ధంగా ఉన్నారనేది ఈ కార్యక్రమాన్ని పరిశీలిస్తే అర్థమవుతున్నది.బుల్లెట్, బాంబుల శక్తికంటే అభివృద్ధే బలమైనదని ఇదే నిరూపిస్తున్నది అని తెలిపారు. 

సీనియర్ అధికారులు తొలిసారి కశ్మీర్‌లోని 4,500 పంచాయతీల్లో ఉన్న గ్రామస్థుల తలుపులను తట్టారని, సరిహద్దున కాల్పులు జరిగే గ్రామాల్లోనూ నిర్భయంగా పర్యటించారని పేర్కొన్నారు. షోపియాన్, కుల్గాం, అనంత్‌నాగ్‌లలోని మారుమూల గ్రామాల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని తెలిపారు. 

‘దేశంలో మిగతా ప్రాంతాల మాదిరి తమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని ఆ రాష్ట్ర ప్రజలు ఎంత తహతహలాడుతున్నారో దాన్నిబట్టి తెలుస్తోంది. అలాంటి కార్యక్రమాలు, వాటిలో పాల్గొనాలన్న వారి కోరిక చూస్తే మంచి పరిపాలన కావాలని వారెంతగా కోరుకుంటున్నారో తెలుస్తోంది. బుల్లెట్లు, బాంబులకన్నా అభివృద్ధి అనేది చాలా శక్తివంతమైంది’ అని ప్రధాని పేర్కొన్నారు.

ఈ నెల 1 నుంచి ఇప్పటివరకు 3 లక్షలమంది భక్తులు అమర్‌నాథ్ యాత్రను పూర్తిచేసుకున్నారని తెలుపుతూ ప్రత్యేక సన్నాహాలతో ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రజలను కోరారు. 

ఇలా ఉండగా, జమ్ముకశ్మీర్ ఎన్నికలు, అక్కడ శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్షించేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఆ రాష్ట్ర కోర్‌గ్రూప్ సభ్యులతో మంగళవారం సమావేశం కానున్నారు. ఈ మేరకు జమ్ముకశ్మీర్ నాయకులను, బీజేపీ ముఖ్యనాయకులను ఢిల్లీకి రావాలని మోదీ ఆదేశించారు. 

సమావేశానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర మంత్రి జితేంద్రసింగ్, బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి రాంమాధవ్, జమ్ముకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా తదితరులు హాజరుకానున్నారు. జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుతం రాష్ట్రపతిపాలన కొనసాగుతున్నది.