బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్బ్రాంతి : 55 మంది మృతి

జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటన ఆర్టీసీ చరిత్రలోనే అది పెద్దదిగా చెప్పుకోవచ్చు. ప్రమాదంలో మృతుల సంఖ్య 55కు పెరిగింది. దేశంలో ఇప్పటి వరకు బస్సు ప్రమాదాలలో ఇంత భారీ సంఖ్యలో మరణాలు జరగలేదు. అత్యధికంగా మృతులు 51 మంది చొప్పున సిమ్లా, కాశ్మీర్ లోయలలో జరిగిన రెండు బస్సు ప్రమాదాలలో గతంలో ఉన్నారు.

కాగా, రోడ్డు ప్రమాద ఘటన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు, గాయపడిన వారికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబసభ్యులకు రాష్ట్రప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండి, వారిని ఆదుకుంటుందని ఆశిస్తున్నానన్నారు. ఈ మేరకు తన సంతాపాన్ని ప్రకటిస్తూ రాష్ట్రపతి తెలుగులో ట్వీట్ చేశారు.

ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదం తనను షాక్‌కు గురిచేసిందని, ప్రమాదంపై మాట్లాడేందుకు మాటలు రావట్లేదని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాట్లు చెప్పారు.  

బస్సు ప్రమాదంలో 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోవడం తనను ఎంతో కలచివేసిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. ప్రమాదంలో మృతి చెందినవారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. బస్సు ప్రమాదం పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. బస్సు ప్రమాదం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుడా  తీవ్ర విచారం వ్యక్తం చేశారు.