బెంగాల్ కాంగ్రెస్‌లో ‘బ్యాలెట్’ చిచ్చు!

స్థానిక ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు వినియోగించాలన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపింది. పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీలో ఓ వర్గం మమతా ప్రతిపాదనను సమర్ధిస్తుండగా మరొక వర్గం వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలో కాంగ్రెస్ రెండుగా చీలిపోయే పరిస్థితి దాపురించింది.

పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు వినియోగించాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి కోరుతున్నారు. కాంగ్రెస్‌లోని మెజారిటీ వర్గం, ఎమ్మెల్యేలు తృణమూల్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తుస్తోంది. మరొక వర్గం మాత్రం బీజేపీని ఏకాకిని చేయాలంటే మమతాబెనర్జీ డిమాండ్‌కు మద్దతును ఇవ్వాల్సిందేనని వాదిస్తున్నారు. ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ కేంద్ర కమిటీ అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయాన్ని వారీ సందర్భంగా గుర్తుచేస్తున్నారు.

‘ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరగడం అన్నది ప్రధానం. అయితే తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పశ్చిమ బెంగాల్‌లో అలాంటి పరిస్థితులే లేవు. స్థానిక ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు వాడితే అధికార తృణమూల్ కాంగ్రెస్ విచ్చల విడిగా రిగ్గింగ్ చేసేస్తుంది’ అని పీసీసీ అధ్యక్షుడు సోమెన్ మిత్రా  ధ్వజమెత్తారు. ఈవీఎంల పనితీరుపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేసినంత మాత్రాన బ్యాలెట్ పద్ధతినే మళ్లీ పెట్టమని కోరడం కాదని స్పష్టం చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాతంగా నిర్వహిస్తామన్న తృణమూల్ అధినేత్రి మాయావతి ముందు హామీ ఇచ్చాకే, బ్యాలెట్ డిమాండ్ చేయాలని ఆయన స్పష్టం చేశారు.

లోక్‌సభ ఎన్నికల్లో చేదు ఫలితాలు చూసిన మమతా బెనర్జీ బ్యాలెట్ జపం చేస్తున్నారని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత ఆధిర్ చౌదరి ఎద్దేవా చేశారు. ‘గత పంచాయితీ ఎన్నికల్లో ఏం జరిగిందీ మేం ఇంకా మరిచిపోలేదు. విచ్చల విడిగా రిగ్గింగ్ జరగడానికి ఆమె(మమత)నే కారణం. 35 శాతం సీట్లు ఎన్నికలు లేకుండానే తృణమూల్ కాంగ్రెస్ ఏకగ్రీవంగా నెగ్గేసింది’అని ఆయన విమర్శించారు.

బ్యాలెట్ పేపర్ల వినియోగం తృణమూల్‌కే లాభం చేస్తుందన్న కాంగ్రెస్ వాదనతో సీపీఎం ఏకీభవిస్తోంది. ఎన్నికలను లూటీ చేయడానికే ఆమె కొత్త ఎత్తులు వేస్తోందని మండిపడ్డారు. అయితే కాంగ్రెస్‌లోని ఓ వర్గం మాత్రం సీఎం మమతా బెనర్జీ అభిప్రాయంతో ఏకీభవిస్తోంది. బీజేపీని ఏకాకిని చేయాలంటే బ్యాలెట్ విధానమే సరైందని వారు వాదిస్తున్నారు.