జాతీయ భద్రతకు సంబంధించి వెనుకడుగు లేదు

జాతీయ భద్రతకు సంబంధించి వెనుకడుగు లేదు..ఎటువంటి ఒతిళ్లకు లోనయ్యేది లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. కార్గిల్ 20వ వార్షిక విజయోత్సవం సందర్భంగా శనివారం ఒక కార్యక్రమంలో పాల్గొంటూ  దేశ భద్రత దుర్భేధ్యమని, ఈ విషయంలో ఏ శక్తి ఏమీచేయలేదని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌తో 1999 యుద్ధంలో జరిగిన యుద్ధంలో మృతి చెందిన జవాన్లకు ప్రధాని నివాళులు అర్పించారు. 

కార్గిల్ విజయం భారతదేశ ధైర్యసాహసాలు, మొక్కవోని దీక్ష దక్షతకు కలబోసిన ప్రతీకాత్మకత అని, భారతీయ విజయానికి కార్గిల్ ఒక జెండా అని తెలిపారు. 20 ఏళ్లు దాటినా ఇప్పటికీ కార్గిల్ దేశ ప్రజలందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ‘ యుద్ధాలు సైన్యం పటాటోపంతో జరగవు. దేశ ప్రజలతోనే ఇవి జరుగుతాయి. వారి ధైర్యసాహసాలతోనే యుద్ధాలలో గెలుస్తాం అనేది కార్గిల్ ఘటన నిరూపించిందని ప్రధాని తెలిపారు. 

కార్గిల్ అమరవీరులకు తాను జాతి తరఫున నివాళులు అర్పిస్తున్నట్లు శనివారం జరిగిన సంస్మరణ సభలోప్రధాని వెల్లడించారు. కార్గిల్ యుద్ధం పతాక స్థాయిలో ఉన్నప్పుడు 20 ఏళ్ల క్రితం తాను కార్గిల్‌కు వెళ్లానని ప్రధాని మోడీ తెలిపారు. అప్పుడు భీకర యుద్ధం ఉందని, శత్రువులు ఎతైన శిఖరాలపై దాగి ఉండి కాల్పులు జరుపుతున్నారని, ముంగిట్లోనే మృత్యువు కన్పిస్తూ ఉన్న మన వీర జవాన్లు త్రివర్ణ పతాకం చేతబూని నిర్ణీత ప్రాంతానికి చేరుకునేందుకు ముందుకు సాగుతూనే ఉండటం తనను కదిలించివేసిందని గుర్తు చేసుకున్నారు. 

దేశ భద్రతతోనే దేశ భద్రత ముడివడి ఉందని, దేశం సురక్షితంగా ఉంటేనే ప్రజలు కంటినిండా నిద్రపోగలుగుతారని ప్రధాని చెప్పారు. దేశ భద్రతా బలగాల ఆధునీకరణనే తమ ప్రభుత్వ ప్రాధాన్యతాక్రమం అని మోడీ తేల్చిచెప్పారు. ఏ సైనిక విభాగానికి ఆ సైనిక విభాగం రోజులు పొయ్యాయని, కాల్బలం, నౌకాదళం, వైమానిక దళాల సమన్వయం కలిసికట్టుగా ముందుకు సాగడం వల్లనే సవాళ్లను సమర్థవంతంగా తిప్పికొట్టగలమని తెలిపారు. 

కొన్ని దేశాలు ప్రచ్ఛన్న యుద్ధానికి పాల్పడుతున్నాయని, ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతూ, సీమాంతర ఉగ్రవాదాన్ని సాగిస్తూ ఉన్నాయని పాకిస్థాన్‌పై ప్రధాని పరోక్షంగా దాడికి దిగారు. ఇటువంటి శక్తులను ధైర్యంగా తిప్పికొట్టడానికి ప్రపంచ దేశాల మధ్య సహకారం అవసరం పిలుపిచ్చారు. 

ఈ నివాళి సభ సందర్భంగా ప్రధాని మోడీ అక్కడికి వచ్చిన జనరల్ బాత్రాను కలిసి మాట్లాడారు. బాత్రా కుమారుడు క్యాప్టెన్ విక్రమ్‌బాత్రా కార్గిల్ యుద్ధ సమయంలో ప్రాణాలు అర్పించారు. ఆయనకు పరమ్ వీర్ చక్ర పురస్కారం దక్కింది. పరమ్‌వీర్ చక్ర గ్రహీత క్యాప్టెన్ విక్రమ్ బాత్రా కోసం జాతి యావత్తూ యే దిల్ మాంగే మోర్ అంటోందని, తన హృదయం ఆయన వంటి వారికోసం ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటుందని మోడీ కితాబు ఇచ్చారు. 

ఆయన కోసం ప్రార్థనలలో మతం భాష, కులాల ప్రస్తావన లేదని, వీటికి అతీతంగా దేశమంతా నివాళి అర్పిస్తోందని అన్నారు. కార్గిల్ వీరుల సంతాప సభకు భారీ సంఖ్యలో వీరజవాన్ల కుటుంబాల వారు,సన్నిహితులు తరలివచ్చారు. గత ఐదేళ్లలో సైనిక కుటుంబాల సంక్షేమానికి తమ ప్రభుత్వం అనేక చర్య లు చేపట్టిందని, దశాబ్దాలుగా పరిస్కారంకాని సమస్యలను పరిష్కరించిందని కార్గిల్ విజ య్ దివస్ దశలో ప్రధాని తెలిపారు. అమరజవాన్ల పిల్లలకు స్కాలర్‌షిప్‌లను పెంచాలని ఇప్పుడు తమ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రాగానే నిర్ణయించిందని చెప్పారు.