మోదీకి లేఖ రాసిన 49 మందిపై కోర్టులో పిటిషన్

మూక దాడులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన ప్రముఖులపై బిహార్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ప్రముఖులపై భారత శిక్షా స్మృతిలోని వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయాలని పిటిషనర్ కోరారు.

మూక దాడులు, విద్వేషపూరిత నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని 49 మంది ప్రముఖులు ప్రధాన మంత్రికి మంగళవారం ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. వీరిలో రేవతి, మణిరత్నం, శ్యామ్ బెనెగల్, అనురాగ్ కాశ్యప్, అపర్ణ సేన్ వంటి వివిధ రంగాలకు చెందిన మేధావులు ఉన్నారు. వీరు దేశ ద్రోహం, దేశ సమగ్రతకు విఘాతం కలిగించడం, మతపరమైన మనోభావాలను గాయపరచడం వంటి నేరాలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ న్యాయవాది సుధీర్ కుమార్ ఓఝా చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేశారు.

49 మంది ప్రముఖులు మంగళవారం రాసిన లేఖను ప్రతిఘటిస్తూ 61 మంది ప్రముఖులు శుక్రవారం ప్రధాని మోదీకి వేరొక లేఖ రాసిన సంగతి తెలిసిందే. వీరిలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్, దర్శకులు మధుర్ భండార్కర్, వివేక్ అగ్నిహోత్రి వంటివారు ఉన్నారు. సుధీర్ పిటిషన్‌లో ఈ 61 మందిని సాక్షులుగా పేర్కొనడం విశేషం. ఈ పిటిషన్‌పై ఆగస్టు 3న విచారణ జరిగే అవకాశం ఉంది.

‘జై శ్రీరామ్’ను రెచ్చగొట్టే రణ నినాదంగా 49 మంది ప్రముఖులు రాసిన లేఖలో అభివర్ణించారు. ఈ నినాదం చేస్తూ చాలా మూక దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. వీరి ఆరోపణలను వ్యతిరేకిస్తూ కంగనా రనౌత్, ప్రసూన్ జోషి, మాలిని అవస్థి వంటి 61 మంది మేధావులు మోదీకి లేఖ రాశారు. 49 మంది మేధావులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఎంపిక చేసుకున్న కొన్ని సంఘటనలపై మాత్రమే స్పందిస్తున్నారని దుయ్యబట్టారు. 

అంతర్జాతీయంగా భారత దేశ కీర్తి, ప్రతిష్ఠలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. భారతీయతకు మూలాలైన సకారాత్మక జాతీయవాదం, మానత్వం పునాదులపై పరిపాలన చేసేందుకు ప్రధాని మోదీ నిరంతరం చేస్తున్న కృషిపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.