బీజేపీ ప్రభుత్వానికి మద్దతుకై జేడీఎస్ ఎమ్యెల్యేల వత్తిడి

తనకు మద్దతు ఇస్తున్న ఎమ్యెల్యేలను హైజాక్ చేసి తన ప్రభుత్వాన్ని కూలదోశారని అంటూ నిన్నటి దాకా తీవ్ర విమర్శలు చేసిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్ డి కుమారస్వామి ఇప్పుడు తన పార్టీకి చెందిన ఎమ్యెల్యేల నుండే బలపరీక్షలో బిజెపి ముఖ్యమంత్రి బి ఎస్   యడియూరప్ప ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని వత్తిడి ఎదుర్కొంటున్నారు.

జేడీఎస్‌ ఎమ్మెల్యేలతో ఓ హోటల్‌లో కుమారస్వామి జరిపిన ఈ భేటీలో ముఖ్యంగా రెండు ప్రతిపాదనలు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం మాజీ మంత్రి జీవీ దేవెగౌడ ఈ వివరాలను వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వానికి మద్దతునిచ్చి ప్రభుత్వంలో భాగస్వామి కావడమా? లేక ప్రజల్లో ఉంటూ యడియూరప్పపై పోరాటం చేయడమా? అనే అంశాలపై చర్చ జరిగినట్లు తెలిపారు.

అయితే ఈ భేటీలో పలువురు ఎమ్మెల్యేలు బీజేపీకి బయటినుంచి మద్దతు ఇచ్చేందుకు సుముకంగా ఉన్నారని వెల్లడించారు. తనతో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యే మద్దతుకు సిద్ధంగా ఉన్నామని.. దీనిపై కుమారస్వామి తుది నిర్ణయం తీసుకోవల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

ఈ నేపథ్యంలో కుమారస్వామి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్‌తో జేడీఎస్‌ చెలిమిని కొనసాగిస్తుందా? బీజేపీకి పరోక్షంగా మద్దతు తెలుపుతుందా? కాంగ్రెస్‌తో చెలిమికి గుడ్‌బై చెప్పి, బీజేపీ ప్రభుత్వంపై ఒంటరిగానే పోరాటం చేస్తుందా? అనే అంశాలు ఆసక్తిగా మారాయి.

మరోవైపు బీజేపీ కూడా జేడీఎస్‌ సభ్యుల మద్దతు కోరడంపై ఆలోచనలు చేస్తున్నట్ల తెలిసింది. వారితోపాటు రెబల్స్‌ను కూడా తమవైపునకు తిప్పుకునేందుక ప్రయత్నలను ముమ్మరం చేస్తోంది కమళ దళం. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే విశ్వాస పరీక్షపై ఉ‍త్కంఠ రోజురోజుకూ పెరుగుతోంది.