ఒక్కొక్కరి దగ్గర రూ.5లక్షలు తీసుకున్న జగ్గారెడ్డి !

మానవ అక్రమ రవాణా కేసులో అరెస్ట్ చేసిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.5లక్షలు చొప్పున మొత్తం రూ 15 లక్షలు తీసుకున్నట్లు ఒప్పుకున్నారని డీసీపీ సుమతి తెలిపారు. సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్‌స్టేషన్ ఎస్సై అంజయ్యకు వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు.

జగ్గారెడ్డి తన కుటుంబసభ్యుల పేర్లతో అక్రమంగా పాస్‌పోర్టు పొందారు. భార్య నిర్మల, కుమార్తె జయలక్ష్మి, కుమారుడు భరత్‌సాయిరెడ్డి పేర్లతో పాస్‌పోర్టు తీసుకున్నారు. ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే అధికార దుర్వినియోగం కింద కేసు నమోదు చేశామని వివరించారు.

2004లో నకిలీ పత్రాలతో కుటుంబసభ్యుల పేర్లతో పాస్‌పోర్టు తీసుకున్నట్లు గుర్తించారు. ఆధార్ కార్డుల డేటా ఆధారంగా వివరాలు సేకరించారు. డాక్యుమెంట్లలో భార్య ఫొటో, కుమార్తె జయలక్ష్మి, కుమారుడు భరత్ సాయిరెడ్డిల పుట్టినతేదీ మార్పిడి జరిగింది. ఫ్యామిలీ ఫొటో, ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మధ్యవర్తి మధును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని డీసీపీ సుమతి వెల్లడించారు. పాస్‌పోర్టు ద్వారా వెళ్లింది తెలంగాణ రాష్ర్టానికి చెందిన వారు మాత్రం కాదని ఆమె తెలిపారు. పాస్‌పోర్టు ద్వారా ముగ్గురిని అమెరికా తీసుకెళ్లినట్లు గుర్తించామని పేర్కొన్నారు..

జగ్గారెడ్డిపై ఐపీసీ 419, 420, 467, 468, 471, 370 సెక్షన్లతో పాటు పాస్‌పోర్టు చట్టం 1967 సెక్షన్ 12, ఇమ్మిగ్రేషన్ చట్టం 1983 సెక్షన్ 24 కింద కేసు నమోదు చేశామన్నారు. అన్ని కేసులకు సంబంధించి అధికారిక ఆధారాలున్నాయని పేర్కొన్నారు. మధు అనే బ్రోకర్ ద్వారా మనుషుల అక్రమ రవాణా జరిగిందని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం జగ్గారెడ్డిని సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.