ప్రైవేట్ వైద్య సేవల ఒప్పందాలు సమీక్షించాల్సిందే

వైద్యసేవలకు సంబంధించి వివిధ ప్రైవేటు సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలను సమీక్షించాలని ఆరోగ్యరంగంపై నియమించిన సుజాతరావు కమిటీ ఏపీ ప్రభుత్వానికి నివేదించింది. ఈ మేరకు కొన్ని సిఫార్సులతో కూడిన మధ్యంతర నివేదికను కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి అందచేశారు. గిరిజన ప్రాంతాలతోపాటు అన్ని జిల్లాల్లో పర్యటించామని, 108, 104 సేవలతోపాటు వివిధ ప్రభుత్వ ఆస్పత్రులు, స్విమ్స్‌, రిమ్స్‌, బర్డ్‌ , టిఎంసిలతోపాటు ఎపి మెడ్‌టెక్‌ జోన్‌ కూడా సందర్శించామని కమిటీ వెల్లడించింది. పూర్తి వివరాలను తుది నివేదికలో పొందుపరుస్తామని తెలిపింది.

108, 104 సేవలపై కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో 440 అంబులెన్సులున్నా అవి కేవలం రోగులను చేరవేసేలా ఉన్నాయని, వాటిలో ప్రాథమిక చికిత్స అందడంలేదని నివేదికలో పేర్కొన్నారు. 108 సహాయం కోసం ఫోన్‌ కాల్స్‌కు స్పందించని ఘటనలు పెరుగుతున్నాయని పేర్కొంది. సమయానికి వేతనాలు అందక 108 ఉద్యోగులు నిరాశతో ఉన్నారని, వారికిచ్చే శిక్షణలో నాణ్యత లేదని తెలిపింది.

కొత్తవాహనాల కొనుగోలు, ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్లు నెలకొల్పడం, సాంకేతిక పరిజ్ఞానం ఆధునీకరించడం వంటి అంశాలపై కీలక సూచనలు చేసింది. 104 వాహనాలు కూడా పదేళ్లకు పైబడి ఉన్నాయని, ఉన్న వనరులను కూడా వాడుకోలేని పరిస్థితి ఉందని కమిటీ తెలిపింది. మందుల సరఫరాలో కూడా లోపాలున్నాయని, క్లినికల్‌ ఆడిట్‌ కూడా సరిగ్గా లేదని కమిటీ మధ్యంతర నివేదికలో పేర్కొంది. ఇక్కడ వైద్య సదుపాయాలు మెరుగుపడేంతవరకు హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ఆపరేషన్లకు అనుమతించాలని కమిటీ సూచించింది.

వైద్యరంగాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసి, వచ్చేనెల 30లోగా తుది నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి కోరారు. ఆగస్టు 12న కమిటీతో మరోసారి భేటి అవుతానని చెప్పారు. 108, 104 వాహనాల కొనుగోలు ఎప్పటిలోగా కొనుగోలు చేయాలి, ప్రజలకు కంటి పరీక్షలు, హెల్త్‌ కార్డుల జారీపై నిర్ధిష్ట కార్యచరణ సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్రంలో నిర్మించతలపెట్టిన 5 క్యాన్సర్‌ ఆస్పత్రులు, మూడు మెడికల్‌ కాలేజీలు, రెండు కిడ్నీ ఆస్పత్రుల శంకుస్థాపన పనులపై కూడా కార్యచరణ సిద్ధం చేయాలని సూచించారు.

ఆరోగ్యశ్రీ కింద అందించే ఉచితవైద్యంపై విధివిధానాలను ఖరారు చేయాలని, ఈ పథకం కింద ఉన్న నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. కమిటీ చైర్‌పర్సన్‌ కె. సుజాతా రావుతోపాటు సభ్యులు, వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణశ్రీనివాస్‌ (నాని) తోపాటు ఆశాఖ ముఖ్య కార్యదర్శి కె.ఎస్‌. జవహర్‌ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.