నాలుగోసారి ముఖ్యమంత్రిగా యడియూరప్ప ప్రమాణం

కన్నడనాట కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యెడియూరప్ప (75) నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ వాజూభాయ్ వాలా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. సోమవారం అసెంబ్లీలో యెడియూరప్ప మెజార్టీని నిరూపించుకోనున్నారు.

సంఖ్యాశాస్త్రంపై నమ్మకంతో ప్రమాణ స్వీకారానికి ముందే యెడియూరప్ప తన పేరులోని అక్షరాలను మార్చుకోవడం గమనార్హం. దీంతో ఆయన పేరు యడ్యూరప్ప కాస్త యెడియూరప్పగా మారింది. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు పతనం అయినప్పటికీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేశ్ కుమార్ గురువారం అనర్హత వేటు వేయడంతో సస్పెన్స్ మరింత పెరిగింది.

అయితే శుక్రవారం ఉదయం పరిణామాలు వేగంగా మారిపోయాయి. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా యెడియూరప్ప గవర్నర్‌ను కలిశారు. అందుకు ఆయన సమ్మతించడంతో రాష్ట్రంలో బీజేపీ సర్కారు మరోసారి కొలువుదీరింది. శుక్రవారం యెడియూరప్ప ఒక్కరే ప్రమాణం చేశారు. మంత్రివర్గంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని యెడియూరప్ప తెలిపారు.

ప్రమాణస్వీకార అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు వరాలు ప్రకటించారు. పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం ఇస్తున్న రూ.6 వేలకు అదనంగా మరో రూ.4000 అందించనున్నట్లు ప్రకటించారు. అలాగే చేనేతల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. సోమవారం అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోనున్నట్లు ప్రకటించారు.

కర్ణాటకలో సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తామని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా చెప్పారు. 75 ఏండ్లు పైబడిన వారు ప్రభుత్వ పదవి చేపట్టకూడదని పార్టీ పెట్టుకున్న నియమం యెడియూరప్పకు వర్తించదా అని ప్రశ్నించగా.. యెడియూరప్ప బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఉన్నారని, సహజంగానే ఆయనను సీఎంగా ఎంపికచేసిందని బదులిచ్చారు.

లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన యెడియూరప్ప 1943 ఫిబ్రవరి 27న మండ్య జిల్లాలోని బూకనకెరె గ్రామంలో జన్మించారు. బాల్యంలోనే ఆర్‌ఎస్సెస్‌లో చేరారు. 1983లో తొలిసారి శిఖరిపుర స్థానం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం ఎనిమిది సార్లు అక్కడి నుంచి గెలుపొందారు. ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లారు. తాను పనిచేసిన రైస్ మిల్ యజమాని కుమార్తెను ఆయన వివాహమాడారు. 2007 నవంబర్‌లో తొలిసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి దక్షిణాది నుంచి తొలి బీజేపీ సీఎంగా గుర్తింపు పొందారు.