కొండగట్టు ఘాట్‌ వద్ద బస్సు బోల్తా.. 32 మంది మృతి

జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 32 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు కొండగట్టు మీద నుంచి కిందకు వస్తున్న సమయంలో ప్రమాదమైన మూల మలువు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 52 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన బస్సు జగిత్యాల డిపోకు చెందినదిగా గుర్తించారు.

 మరో నిమిషంలో ప్రధానరహదారిపైకి చేరుకునే సమయంలో ప్రమాదం జరిగింది. స్పీడ్‌ బ్రేకర్‌ దగ్గర అదుపు తప్పగా, ప్రయాణికులంతా డ్రైవర్‌ వైపు ఒరగడంతో బస్సు బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్పీ సింధూ శర్మ, కలెక్టర్ శరత్ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంపై  తెలంగాణా  ఆపద్ధర్మ ముఖ‍్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కొరికీ రూ.5 లక్షల చొప్పున సీఎం ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు