సా. 6 గం. లకు యడ్డ్యూరప్ప ప్రమాణస్వీకారం

కర్ణాటకలో బిజెపి పక్ష నేత, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బిఎస్ యడ్డ్యూరప్ప శుకవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం గవర్నర్ వాజూభాయ్ వాలాను రాజ్ భవన్ లో కలుసుకొని ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు.

హెచ్ డి కుమారస్వామి నాయకత్వంలోని కాంగ్రెస్-జెడి(ఎస్) సంకీర్ణ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో మంగళవారం విఫలం కావడంతో ముఖ్యమంత్రి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలను  తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా యడ్యూరప్ప ఆహ్వానించారు.

అసెంబ్లీలో మెజార్టీని నిరూపించుకునేందుకు యడ్యూరప్పకు గవర్నర్ వారం సమయం ఇచ్చినట్లు తెలిసింది. యడ్యూరప్ప వచ్చే సోమవారం తన ప్రభుత్వ మెజార్టీని విధాన సభలో నిరూపించుకోవాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే.. శుక్రవారం యడ్యూరప్ప ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. మిగిలిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అంశంపై పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో నేడు చర్చించనున్నట్లు యడ్యూరప్ప తెలిపారు.

జీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేశ్‌ కుమార్‌ అనర్హత వేసిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వం ఏర్పాటుకు బిజెపి సిద్దపడటం గమనార్హం.  ముగ్గురి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో సభలోని సభ్యుల సంఖ్య 221కి తగ్గింది. ఇందులో స్పీకర్‌ కూడా ఉండటంతో ఎమ్మెల్యేల సంఖ్య 220కి చేరింది.

ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 110 మంది సభ్యుల మద్దతు ఉండాలి. ప్రస్తుతం భాజపా చేతిలో 105 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మరోవైపు మిగిలిన 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను పరిశీలించి వారి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తోంది.