పలు ఠాణాల్లో అక్బర్‌ వ్యాఖ్యలపై బిజెపి ఫిర్యాదులు

కరీంనగర్‌ సభలో హిందువులపై అక్బరుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఎడాపెడా కేసులు నమోదయ్యాయి. బీజేపీ కార్యకర్తలు పలు ఠాణాల్లో అక్బర్‌ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. కరీంనగర్‌లో జిల్లా బీజేపీ అధ్యక్షుడు బాస సత్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నగర కమిషనర్‌ వీబీ కమలాసన్‌ రెడ్డిని కలిసి అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు.

ఆయన వ్యాఖ్యలు హిందువులపై దాడులకు ముస్లింలను పురిగొల్పడమేనంటూ చైతన్యపురి పోలీసులకు బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యశ్‌పాల్‌గౌడ్‌ ఫిర్యాదు చేశారు. అక్బర్‌పై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ రెండవ పట్టణ పోలీసుస్టేషన్‌లో బీజేపీ జిల్లా నాయకులు శివనాయక్‌, పోతుల రాజేందర్‌ అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలపై ఫిర్యాదు నమోదు చేశారు.

15 నిముషాల సేపు పోలీసులను లేకుండా చేస్తే దేశంలో హిందూ, ముస్లిం జనాభా సమానంగా అవుతుందని 2013లో చేసిన వివాదాస్పద వాఖ్యాలను తిరిగి ప్రస్తావిస్తూ అందుకనే తనను ఆర్ ఎస్ ఎస్ వారు ద్వేషిస్తున్నారని అక్బరుద్దీన్ చెప్పుకొచ్చారు.

హిందువులను హతమారుస్తామన్న మజ్లి్‌సతో టీఆర్‌ఎ్‌సకు దోస్తీనా అంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ ప్రశ్నించారు. హిందువులపై అక్బరుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మజ్లి్‌సతో స్నేహం చేసి.. సీఎం కేసీఆర్‌ పాముకు పాలు పోసి పెంచుతున్నారని డిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ దుయ్యబట్టారు.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ కుమ్మక్కై బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి బీజేపీ ప్రతినిధుల బృందం ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ఆధ్వర్యంలో పలువురు నేతలు కిషన్‌రెడ్డిని ఢిల్లీలో కలిసి.. అక్బర్‌ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు స్పందించిన మంత్రి కిషన్‌రెడ్డి తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.

మతతత్వాన్ని ప్రేరేపించేలా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ ప్రసంగించారని, వెంటనే క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.  హిందూ-ముస్లింల మధ్య అక్బరుద్దీన్‌ చిచ్చుపెడుతున్నారంటూ వీహెచ్‌పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.