గోదావరి జలాలు కృష్ణాకు తరలింపుకు బ్రేక్ !

గోదావరి మిగులు జలాలను కృష్ణా ప్రాజెక్టులకు తరలించే ప్రతిపాదనపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై హడావుడిగా ప్రకటన చేసినప్పటికీ ఈ విషయంలో ముందడుగు వేయడంలో అనిశ్చిత స్థితి నెలకొంది. ఈ విషయమై రెండు రాస్త్రాల మధ్య జరుగుతున్నా చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడింది. రెండు రాష్ట్రాల ఇంజినీర్ల అంతర్గత సమావేశాల జోరు కూడా తగ్గింది. దానితో ఈ ప్రతిపాదనకు ప్రస్తుతం బ్రేక్ పడినట్లు స్పష్టం అవుతున్నది. 

సాంకేతిక, న్యాయపరమైన కారణాలతో రెండు రాష్ట్రాలు ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతున్నది. జూన్‌ 29న హైదరాబాద్‌లో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో గోదావరి జలాల తరలింపు అంశంపై తెలంగాణ, ఏపీల మధ్య సూత్రప్రాయమైన మౌఖిక అంగీకారం కుదిరింది. ఈ ప్రతిపాదనపై ఏవిధంగా ముందుకు వెళ్లాలనే అంశంపైన, సాంకేతిక, ఆర్థిక అంశాలపైన రెండు రాష్ట్రాల ఇంజినీర్లు కలిసి చర్చించాలని అప్పుడే నిర్ణయించారు.

నీటి తరలింపు ప్రణాళిక, ప్రతిపాదనలను జులై 15 లోగా ఖరారు చేయాలని కూడా సీఎంలు ఆదేశించారు. ముందుకు వచ్చిన కొన్ని ప్రతిపాదనలపై రెండు రాష్ట్రాల ఇంజినీర్లు పలుమార్లు విడిగా చర్చించిన తర్వాత జులై మొదటి వారంలో హైదరాబాద్‌లో సమావేశమై ఉమ్మడిగా చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి వచ్చిన మూడు, ఏపీ నుంచి వచ్చిన రెండు ప్రతిపాదనలపై ప్రాథమికంగా చర్చ జరిగింది.

గోదావరి నీటిని దుమ్ముగూడెం, రాంపూర్‌, తుపాకుల గూడెం ప్రాంతాల నుంచి ఉదయసముద్రం వరకూ తరలించి అక్కడి నుంచి ఒక టీఎంసీ నాగార్జునసాగర్‌కు, మరో టీఎంసీ శ్రీశైలానికి తరలించవచ్చనే ప్రతిపాదన తెలంగాణ నుంచి వచ్చింది. పోలవరం నుంచి కూడా మరో రెండు టీఎంసీలను సాగర్‌కు తరలించాలనే ప్రతిపాదనను కూడా తెలంగాణ ఇంజినీర్లు ముందుకు తెచ్చారు. ఇటువంటి ప్రతిపాదనలనే ఏపీ కూడా చేసింది. 

ఈ ప్రతిపాదనల వివరాలను, చర్చల సారాంశాన్ని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇంజినీర్లు వివరించారు. ఈ నెల 15 న మరోమారు రెండు రాష్ట్రాల ఇంజినీర్లు సమావేశమవ్వాలని నిర్ణయించినప్పటికీ అది వాయిదా పడుతూ వచ్చింది. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయనే సాకుతో ఆ రాష్ట్ర ఇంజినీర్లు సమావేశం తేదీని ఖరారు చేయటం లేదు.

ఇదే సమయంలో తెలంగాణ ఇంజినీర్లు అంతర్గత సమావేశాలు నిర్వహించుకున్నారు. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ఇంజినీర్ల రౌండ్‌ టేబుల్‌ సమావేశం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ సందర్భంగా పలువురు విశ్రాంత ఇంజినీర్లు చేసిన సూచనలను క్రోడీకరించి నివేదిక రూపంలో సీఎం కేసీఆర్‌కు అందచేశారు.

ప్రధానంగా రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతనే గోదావరి జలాలను కృష్ణా ప్రాజెక్టులకు తరలించాలనే సూచన పలువురి నుంచి వచ్చింది. నీటి వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణంలో ముందంజలో ఉన్న ఏపీకి తెలంగాణ భూభాగం నుంచి నీరందించాల్సిన అవసరం ఉన్నదా లేదా అనే అంశం చుట్టూ చర్చ జరుగుతున్నది.

పోలవరం, పట్టిసీమ నుంచి కృష్ణా బేసిన్‌కు ఇప్పుడు తరలిస్తున్న 80 టీఎంసీల నీరు చాలటం లేదని, కృష్ణా డెల్టా కింద ఉన్న 13.5 లక్షల ఎకరాలను నీరిచ్చి, మెట్ట ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచే నీరు తరలించాలనే ప్రతిపాదన ఏపీ ప్రభుత్వం వద్ద ఉన్నది. కృష్ణా-పెన్నా లింక్‌ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ దశలో కేవలం తెలంగాణ భూభాగం నుంచే గోదావరి మిగులు నీటిని తరలించాలనే వాదన ఏపీ ఇంజినీర్లలో బలపడుతున్నది.

గోదావరి నీటిని కృష్ణా ప్రాజెక్టులకు తరలించే ప్రక్రియను రెండు రాష్ట్రాలు రాజీకీయ కోణంలో కూడా  చూస్తూ, ప్రజల విశాల ప్రయోజనాలను పట్టించుకొనక పోవడంతోనే అసలు సమస్యలు తలెత్తుతున్నాయి. రాజకీయ వివాదాలకు కూడా దారితీస్తున్నాయి. పోలవరం నుంచి నీటిని తీసుకువచ్చి కృష్ణా ప్రాజెక్టులకు ఇచ్చే ప్రతిపాదనకు ఏపీలోని ప్రతిపక్షాలు అంగీకరించటం లేదు. 

తెలంగాణలో కూడా ఇదే రకమైన చర్చ జరుగుతున్నది. నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి అధిక వాటా నీరు తీసుకుంటున్న ఏపీకి మళ్లీ ఇక్కడి నుంచి నీరందించటం అవసరమా అని ఇక్కడి ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఇటీవల ఏపీ అసెంబ్లీలో మాట్లాడిన సీఎం జగన్మోహన్‌రెడ్డి కేసీఆర్‌ ఎంతో ఔదార్యంతో తమకు నీరిస్తున్నారని చెప్పారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణలో కలకలం రేపాయి. 

కేవలం ఏపీ ప్రయోజనం కోసమే ఇక్కడి నుంచి నీరందిస్తున్నామనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లటం మంచిది కాదని సీఎం కేసీఆర్‌ తన ఆంతరంగికులతో అన్నట్టు తెలిసింది. నీటి తరలింపుకు సంబంధించిన చర్చలను నామ మాత్రంగా కొనసాగించాలని సీఎం కార్యాలయం నుంచి సమాచారం అందిందని ఒక సీనియర్‌ ఇంజినీర్‌ తెలిపారు.

గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలిస్తే ఇప్పటికే కృష్ణా నీటిలో న్యాయమైన వాటా కోరుతున్న తెలంగాణకు నష్టం వాటిల్లుతుందని కొందరు ఇంజినీర్లు భావిస్తున్నారు. ఈ అంశంపై విచారణ జరుపుతున్న బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు వచ్చే వరకూ వేచి చూడాలనే సూచన కూడా వారు చేస్తున్నారు.