స్వీయ గృహ నిర్బంధంలో మాజీ ఎమ్మెల్యే

అసెంబ్లీ రద్దు రోజుననే 105 మంది అభ్యర్ధులను ప్రకటించిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రస్తుత ఎమ్యెల్యేలలో కేవలం ఇద్దరికీ మాత్రమె సీట్ ఇవ్వడం లేదని చెప్పడంతో పాటు, ఆయా సీట్లను వేరేవారికి కేటాయించారు. ఆ విధంగా సీట్ కోల్పోయిన మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు మంగళవారం స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు.

ముఖ్యమంత్రి తయయుడు, మంత్రి కేటి రామారావుకు సన్నిహితుడిగా భావిస్తున్న్ ఎంపి బాల్క సుమన్‌ కు సీట్ ఇవ్వడం కొరకే ఓదెలుకు సీట్ నిరాకరించడం తెలిసిందే. కేటిఆర్ ప్రమేయంతోనే ఈ విధంగా జరిగిన్నట్లు భావిస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే తొలి ప్రాధాన్యత అని పేర్కొన్న కేసీఆర్‌ తన విషయంలో మాత్రం ఎందుకు అన్యాయం చేశారని ఓదేలు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవంక చెన్నూర్‌ టికెట్‌ అధిష్టానం పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు కేటాయించడంపై స్థానికంగా నిరసన గళం తీవ్రం అవుతున్నది.

మందమర్రి మూడో జోన్‌లోని తన నివాసంలో గృహ నిర్బంధంలో ఉన్నారు. ఆయనతో పాటు భార్య భాగ్యలక్ష్మి, కుమారుడు సందీప్‌, కుమార్తె జ్యోత్స్న, తల్లి పోసవ్వ సైతం ఇంట్లోనే ఉన్నారు. 24 గంటల్లో తనకు సానుకూల స్పందన రాకపోతే జరిగే పరిణామాలకు కేసీఆర్‌ బాధ్యత వహించాలని నల్లాల ఓదెలు హెచ్చరించారు. ఓదెలు చర్యతో కుటుంబ సభ్యులు, అభిమానుల ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పార్టీ శ్రేణులు ఓదెలు ఇంటికి చేరుకొని బయటకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. 

తాను 2009 నుంచి ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని నల్లాల ఓదెలు పేర్కొన్నారు. తాజా జాబితాలో సిట్టింగులు అందరికీ టిక్కెట్లు ఇచ్చిన తనకు ఇవ్వకపోవడం చాలా బాధించిందన్నారు. తనకు ఇప్పటికీ కేసీఆరే దేవుడని, ఎంపీ బాల్క సుమన్‌ వల్లే తనకు టిక్కెట్‌ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఏదొకటి తేలేవరకు తాను గృహ నిర్బంధం నుంచి బయటకు వచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు.