బెంగాల్ బార్ ఎన్నికల్లో బీజేపీ ప్యానల్ ఘన విజయం

హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. బార్ అసోసియేషన్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్యానల్ ఏకంగా ఎనిమిది  సీట్లను కైవసం చేసుకుంది. అధికార టీఎంసీ నాలుగు సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ కేవలం రెండు సీట్లను గెలుచుకుంది. మిగితా ఒక్క సీటును స్వతంత్ర అభ్యర్థి గెలుచుకున్నారు. 

అయితే బార్ అసోసియేషన్ అధ్యక్షుడి పదవి మాత్రం స్వతంత్ర అభ్యర్థి అయిన అశోక్ కుమార్ ధందానియా కైవసం చేసుకున్నారు. ఇక, ఉపాధ్యక్ష పదవికి బీజేపీ అభ్యర్థి అయిన అజయ్ చౌబో ఎన్నిక కాగా, కార్యదర్శి పదవికి ధీరజ్ కుమార్ త్రివేది ఎన్నికయ్యారు. వీటితో పాటు మరో ఐదు కార్యవర్గ పదవులను కూడా బీజేపీ అభ్యర్థులు చేజిక్కించుకున్నారు. 

అయితే బార్ అసోసియేషన్ కోశాధికారి పోస్టు మాత్రం అధికార టీఎంసీకి చెందిన ద్వారకనాథ్ ముఖోపాధ్యాయ చేజిక్కించుకున్నారు. అయితే, బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం ఇదే ప్రథమం. చివరి సంవత్సరం వరకూ తృణమూల్ కాంగ్రెస్ హవాయే కొనసాగింది.