జగన్‌ మాటలకు, చేతలకు పొంతన లేదు

సీఎం జగన్‌ మాటలకు, చేతలకు పొంతన లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. ఆయన చెప్పేదానికి, క్షేత్రస్థాయిలో పూర్తి విరుద్ధంగా ఉందని దయ్యబట్టారు.  రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించనందునే ప్రపంచబ్యాంకు వెనక్కి వెళ్లిందని ఆయన ఆరోపించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే తొందరపాటు నిర్ణయాలు తీసుకుందని విమర్శించారు.

దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి మంచిపనులు చేసి ప్రజల మనసుల్లో నాయకుడిగా నిలిచారని చెప్పారు. రాజన్న ఎప్పుడూ పోలీసు పాలన చేయలేదని.. ప్రజాపాలనే చేశారని కన్నా వ్యాఖ్యానించారు. రాజన్న పాలనంటూ పోలీసు పాలన చేస్తున్నారని విమర్శించారు. 

అసెంబ్లీ జరుగుతున్న తీరు కూడా బాగాలేదని అభిప్రాయపడ్డారు. ప్రజాసమస్యలపై చర్చించాల్సిన సభలో వ్యక్తిగత దూషణలు ఎక్కువయ్యాయని కన్నా ఆరోపించారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ మరో జన్మభూమి కమిటీలాంటిదేనని ఆయన ఎద్దేవా చేశారు. వాటి ద్వారా అరాచకాలు జరిగే అవకాశముందని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానంతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు.