మరో నలుగురు టిడిపి సభ్యులు సస్పెన్షన్‌

ఏపీ శాసనసభ నుంచి మరో నలుగురు టిడిపి సభ్యులను స్పీకర్‌ తమ్మినేని సీతారాం సస్పెండ్‌ చేశారు. సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారనే కారణంతో టిడిపి ఎమ్మెల్యేలు బెందాళం అశోక్‌, వాసుపల్లి గణేశ్‌కుమార్‌, వెలగపూడి రామకృష్ణ బాబు, బాల వీరాంజనేయ స్వామిని సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. 

ఈ రోజు సభ ముగిసేవరకు స్పీకర్‌ ఈ నలుగురినీ సస్పెండ్‌ చేశారు. సభలో నినాదాలు చేయడంతో మార్షల్స్‌ సాయంతో వారిని బలవంతంగా సభ నుంచి బయటకు పంపారు.  

కాగా, ఏపీ శాసనసభ నుంచి వరుసగా మూడో రోజు టిడిపి ఎమ్మెల్యేలు వాకౌట్‌ చేశారు. తెలుగురాష్ట్రాల మధ్య అపరిష్కృత సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షం డిమాండ్‌ చేసింది. 

హైదరాబాద్‌లోని ఏపీ ఆస్తుల్ని తెలంగాణకు ఎలా అప్పగించారని పార్టీ సభ్యులు పాలక పక్షాన్ని నిలదీశారు. ఈ అంశంపై రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ లేవనెత్తిన ప్రశ్నకు తిరిగి మాట్లాడేందుకు అవకాశం కల్పించకపోవడాన్ని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తప్పుపట్టారు. 

ఎంతకూ స్పీకర్‌ అనుమతి ఇవ్వకపోవడంతో సభనుంచి నినాదాలు చేస్తూ బయటకు వచ్చేశారు. ఎన్నికల్లో టి ఆర్ ఎస్ ఇచ్చిన నోట్లకు ప్రతిఫలంగా ఏపీ భవనాలను తెలంగాణకు అప్పగించేశారని ఆరోపించారు.