మమతకు ఓటమి భయం - ఇతర పార్టీల నేతలకు పిలుపు!

పార్లమెంట్ ఎన్నికలలో పరాభవం ఎదురు కావడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఓటమి భయం పట్టుకున్నట్లు కనిపిస్తున్నది. రాష్ట్రంలో పాగా వేయడం కోసం బిజెపి చేస్తున్న ప్రయత్నాలు ఆమెను ఆత్మరక్షణలో పడవేస్తున్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు 'చెంపపెట్టు'గా ఉంటుందోమోనన్న భయం మమతకు పట్టుకుంది. దీంతో ఆమె ఇటీవల తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. 

దీంతో ఆమె కొత్త పల్లవి అందుకున్నారు. గత ఆదివారం కోల్‌కతాలో జరిపిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో మతతత్వ శక్తుల దాడి పెరిగిపోతున్న నేపథ్యంలో వారిని ఎదుర్కొనేందుకు వామపక్ష, కాంగ్రెస్‌ పార్టీల నేతలు తమ పార్టీలో చేరాలని కోరారు. కట్‌మనీ, నిరంకుశ పాలనా విధానాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మమత ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు అవినీతి, అరాచకాల్లో మునిగితేలుతున్నారు. ప్రజలకు న్యాయంగా అందించాల్సిన ప్రభుత్వ పథకాల పంపిణీలో కూడా 'కట్‌మనీ' (కమిషన్లు) రూపంలో లక్షలాది రూపాయలను దోచుకోవడం, ప్రతిపక్షాల కార్యకర్తలు, సానుభూతిపరులపై దాడులు, పక్షపాత వైఖరి, నిరంకుశ విధానాలను అవలంభించడం వంటి చర్యలతో టిఎంసి అధినేత్రి, ముఖ్యమంత్రి మమత బెనర్జీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. 

తాజా లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి బిజెపి గెలిచిందని కోల్‌కతా ర్యాలీలో ఆమె ఆరోపించారు. ఎన్నికల్లో పారదర్శత కోసం దేశంలో తిరిగి బ్యాలెట్‌ పద్ధతిని తీసుకురావాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. 1990వ దశాబ్ధంలో ఇవిఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేసిన మమత 2018 వరకూ ఇవిఎంలకు మద్దతు తెలిపారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి స్థానాలు తగ్గడంతో ఆమె తన వైఖరిని మార్చుకున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు సంక్షేమ పథకాలను అందించాలంటే టిఎంసి కార్యకర్తలకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్ధితి. ప్రజల నుంచి లక్షలాది రూపాయలను కట్‌మనీ రూపంలో దోచుకున్నారు. తమ నుంచి దండుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ప్రజలు ఆందోళన బాట పట్టారు. దీంతో ప్రజాగ్రహానికి భయపడి డబ్బును తిరిగి ఇచ్చేయాలని మమత తన పార్టీ కార్యకర్తలను ఆదేశించింది. 

బిజెపితో పోరాడేందుకు తమతో కలిసిరావాలని మమత ఇచ్చిన పిలుపుపై సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు, లెఫ్ట్‌ఫ్రంట్‌ శాసన సభాపక్ష నేత సృజన్‌ చక్రవర్తి స్పందిస్తూ, అసలు బిజెపి ఎదుగుదలకు మార్గం సుగమం చేసిందే టిఎంసి అని ఆరోపించారు. 

ఇప్పుడు తన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉన్నందున ఆమె తిరిగి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రజల జ్ఞాపకశక్తి ఎంతమాత్రం తక్కువగా అంచనా వేయవద్దని, వారిని మభ్యపెట్టేందుకు ఎంత ప్రయత్నించినా రానున్న కాలంలో ఆమెకు, ఆమె పార్టీకి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.