ప్రతిపక్ష కూటమికి ఆప్ దూరం

బిజెపికి వ్యతిరేకంగా 2019 సార్వత్రిక ఎన్నికల కోసం ఏర్పాటుచేసిన ప్రతిపక్ష కూటమిలో తమ పార్టీ చేరలేదని ఆప్‌ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేసారు.  ప్రతిపాదిత కూటమిలో చేరిన పార్టీలు దేశ అభివృద్దిలో కీలక పాత్ర పోషించలేవని ఆయన పేర్కొన్నారు. ఈ కూటమిలో ఆప్‌ పార్టీ భాగం కాలేదని తేల్చి పారవేసారు.

ఆప్‌ పార్టీ హర్యానా శాసనసభ ఎన్నికలలో, సాధారణ ఎన్నికలలో అన్ని సీట్లకు పోటీ చేస్తుందని కేజ్రీవాల్‌ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి, ప్రజల సంక్షేమం కోసం తమప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలోని విద్య, ఆరోగ్య రంగాలలో తాము విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వచ్చామని ఆయన వెల్లడించారు.

ఢిల్లీతో పోలిస్తే అభివృద్ధిలో హర్యానా వెనకబడిందని కేజ్రీవాల్‌ తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని చూసి ఎలా అభివృద్ధి చేయాలో హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖత్తర్‌ నేర్చుకోవాలని కేజ్రివాల్ సూచించారు. ఢిల్లీ ప్రభుత్వం విద్యుత్తు, నీరు, ఆరోగ్యం, విద్య వంటి సెక్టార్‌లలో విప్లవాత్మక మార్పులు చేపట్టిందని, ఆ రాష్ట్రం ఎందుకు మార్పులు చేయలేక పోయిందని ఆయన హర్యానా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా హర్యానాలోని అంబాలా జిల్లాకు చెందిన జవాన్‌ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. జమ్ముకాశ్మీర్‌లోని గురజ్‌ సెక్టార్‌లో ఉగ్రవాదులు చేపట్టిన కాల్పులలో హర్యానాకు చెందిన జవాన్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే.