ఉగ్రవాదుల కంటే దర్యాప్తు సంస్థలు ఒక్క అడుగు ముందుండాలి

చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) సవరణ బిల్లుకు బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఉగ్రవాదుల కంటే దర్యాప్తు సంస్థలు ఒక్క అడుగు ముందు ఉండాలంటే ఈ సవరణలు ఆవశ్యకమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చకు ఆయన సమాధానమిస్తూ.. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలంటే, ఉగ్రవాదులతో సంబంధాలున్న అనుమానిత వ్యక్తిని కూడా ఉగ్రవాదిగా పరిగణించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

సవరణలను వ్యతిరేకించిన కాంగ్రెస్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన యాసిన్ భత్కల్ వంటి వారిని ముందే ఉగ్రవాదులుగా ప్రకటించి ఉంటే, అతడు 11 బాంబు పేలుళ్లకు పాల్పడడాని కంటే ముందే పట్టుకునేవారమని చెప్పారు. ‘ఏ పార్టీ అధికారంలో ఉందనే విషయంతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఉగ్రవాదం మీద పోరాడుతుంది’ అని  స్పష్టం చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చారని ఆయన గుర్తు చేశారు.

ప్రభుత్వాన్ని నిలదీసే వారిని జాతివ్యతిరేకి అంటూ ముద్రవేసే అవకాశం ఉందన్న విపక్షాల ఆరోపణలపై షా స్పందిస్తూ..నిజమైన  సామాజిక కార్యకర్తలను వేధించే ఉద్దేశం పోలీసులకు లేదని తెలిపారు. ‘దేశంలో మంచి పనులు చేస్తోన్న సామాజిక కార్యకర్తలు చాలామంది ఉన్నారు. మేం పట్టణ మావోయిస్టుల మీద చర్యలు తీసుకోనున్నాం’ అని వెల్లడించారు.

‘ఒక వ్యక్తిని ఉగ్రవాదిగా గుర్తించడానికి నిబంధన ఉండాల్సిన అవసరం ఉంది. యూఎన్‌ వద్ద కూడా దీనికి ఒక విధానం ఉంది. చివరికి పాకిస్థాన్‌కు కూడా ఉంది. చైనా, ఇజ్రాయెల్, యూరోపియన్‌ యూనియన్‌..ఇలా ప్రతి ఒక్కరికి దీనికి సంబంధించి ఒక విధానం ఉంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ చట్టాన్ని, దీనికి సవరణలు తీసుకువచ్చి కఠినతరం చేశారు. అప్పుడు మీరు చేసింది సరైందే అయితే ఇప్పుడు మేం చేసేది కూడా సరైందే’ అని షా విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

ఈ బిల్లును తీసుకురావడం ద్వారా సమాఖ్య వ్యవస్థను ధ్వంసం చేశామని విపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ సమాఖ్య వ్యవస్థ దెబ్బతిని ఉంటే.. ఈ చట్టం రూపుదాల్చిన యూపీఏ హయాంలోనే అది దెబ్బతిని ఉంటుంది అని షా ధ్వజమెత్తారు.

భావజాలం ముసుగులో కొంతమంది అర్బన్ (పట్టణ) మావోయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని, వారిని ఉపేక్షించబోమని అమిత్ షా హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే ఈ చట్టం ఉద్దేశమని, దీన్ని దుర్వినియోగం కానివ్వబోమని హామీ ఇచ్చారు. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి రాష్ట్ర పోలీసుల అనుమతి లేకుండానే ఎక్కడైనా తనిఖీలు నిర్వహించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్‌ఐఏకు) ఈ బిల్లు అధికారాన్ని కల్పిస్తున్నది.

అనంతరం బిల్లుపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ డివిజన్ ఓటింగ్‌కు పట్టుబట్టారు. ఈ సందర్భంగా ఒవైసీ, అధికారపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం నడిచింది. అనంతరం ఓటింగ్ నిర్వహించగా బిల్లుకు మద్దతుగా 287 మంది, వ్యతిరేకంగా ఎనిమిది మంది సభ్యులు ఓటేశారు.