ఆదిలోనే వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత

టిడిపిని కాదనుకొని వైసిపిని ఎన్నుకున్న ఏపీ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టుగా ఉందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఆందోళన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలోపాల్గొంటూ  ఆదిలోనే వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని విచారం వ్యక్తం చేశారు. 

గత ఐదేళ్లలో ఓ ప్రాంతీయ పార్టీ వలన రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలు చూశారని.. అందుకే మరో ప్రాంతీయ పార్టీకి అవకాశమిచ్చారని చెప్పారు. ఈ ప్రభుత్వం వల్ల మేలు జరగకపోగా కీడే ఎక్కువగా జరుగుతోందనే భయం కలుగుతోందని ఆయన ఆరోపించారు.

ఏపీ ప్రజలకు మేలు జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు. 2024 నాటికి ఏపీలో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించబోతుందని ఆయన జోస్యం చెప్పారు.మరో 25 ఏళ్ల పాటు కేంద్రంలో బీజేపీదే అధికారమని రాంమాధవ్‌ పేర్కొన్నారు.

బిజెపిలో సభ్యత్వం దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అని రాంమాధవ్‌ వ్యాఖ్యానించారు. 2024 నాటికి ఏపీలో బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించబోతుందని ఆయన జోస్యం చెప్పారు. గ్రామగ్రామాన బిజెపిని పటిష్ఠం చేయాలని.. సభ్యత్వ నమోదును దీనికి సాధనంగా ఉపయోగించుకోవాలని కార్యకర్తలకు సూచించారు.