బిజెపిలో చేరిన సినీనటి ప్రియా రామన్‌

సినీనటి ప్రియా రామన్‌ బిజెపిలో చేరారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి సమక్షంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యమని నమ్మడం వల్లే తాను బిజెపిలో చేరినట్టు ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతోనే తాను కమలదళంలో చేరినట్టు చెప్పారు. ప్రధాని మోదీ అంటే తనకెంతో అభిమానమని, సత్యమూర్తిని కూడా తానెంతో గౌరవిస్తానని చెప్పారు. ఇలాంటి వారి నాయకత్వంలో దేశం, రాష్ట్రం ముందుకెళ్తాయని తనకు అన్పించడంవల్లే బిజెపిలో చేరినట్టు తెలిపారు.

మోదీ సమర్థ నాయకత్వంలోనే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని తాను విశ్వసిస్తున్నట్టు చెప్పారు. గత కొన్నేళ్లుగా తనకు ప్రజల నుంచి అమితమైన ప్రేమాభిమానాలు, గౌరవం అందాయని.. తానెక్కడికి వెళ్లినా ప్రజల నుంచి ఎంతో ప్రేమ లభించిందని చెబుతూ వారికి సేవ చేసుకోవడం ద్వారానే వారిపై తనకున్న ప్రేమను వ్యక్తపరచగలనని నటి వ్యాఖ్యానించారు.

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో 50కి పైగా చిత్రాల్లో నటించిన ప్రియారామన్‌ స్వతహాగా మలయాళీ.దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలతోనూ ఆమెకు అనుబంధం ఉండటంతో ఆమెను పార్టీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.