చంద్రబాబు అవినీతిపై చర్యలు తప్పవు

టిడిపి అధినేత చదన్రాబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు జరిపిన అవినీతి చర్యలపై చర్యలు తప్పవని బిజెపి రాష్త్ర ఇన్‌చార్జ్ సునీల్ దియోధర్ స్పష్టం చేశారు. 

చంద్రబాబు ఒక గజదొంగ అని, రాష్ట్రాన్ని దోపిడీ చేశారని అంటూ చంద్రబాబుకు సంబంధించిన అవినీతి కేసులను బయటకు తీసి విచారించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపారు. త్వరలోనే అవినీతి కేసులకు సంబంధించిన నివేదికను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని చెబుతూ కేంద్రం వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

అవినీతికి పాల్పడిన నేరస్తులు ఏ పార్టీలో ఉన్నా శిక్షించబడాల్సిందేనని చెబుతూ రాష్ట్రాన్ని అవినీతిరహిత రాష్ట్రంగా మార్చడానికి జగన్ నిబద్ధతతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని తెలిపారు. టీడీపీ చేసిన అవినీతిని వెలికితీయాలని అనేక మీడియా సమావేశాల ద్వారా జగన్‌కు విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. చంద్రబాబుపై ఎవరికీ విశ్వాసం లేదని, అందుకే ఆయనపై సొంత పార్టీ ఎంపీ ట్విట్టర్ వేదికగా కామెంట్లు చేస్తున్నారని గుర్తు చేశారు.

రాష్ట్రంలో టీడీపీ ఖతం అయిపోయిందని, ప్రతిపక్ష పార్టీ శూన్యతను బీజేపీ త్వరలోనే భర్తీ చేస్తుందని  భరోసా వ్యక్తం చేశారు. అప్పటి అవినీతి ప్రభుత్వం.. బీజేపీతో సంబంధాలు తెంచుకోవడం తమకు ఆనందాన్నిచ్చిందని చెబుతూ 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయ పార్టీగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.