ఢిల్లీలో ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు

పరిపాలనా విధానంలో విప్లవాత్మకమైన మార్పుగా భావించే ‘ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు’ పథకాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. ఈ సేవల ద్వారా డ్రైవింగ్ లైసెన్స్, మేరేజ్ రిజిస్ట్రేషన్ సర్ట్ఫికెట్‌లు వంటి సేవలు ఇక ఇంటివద్దే లభిస్తాయి. ప్రస్తుతం ఈ పథకం కింద 30 కంటే ఎక్కువ సేవలు అందిస్తామని, వచ్చే నెలనుంచి వీటి సంఖ్యను వందకు పెంచుతామని, తర్వాత రెండు మూడు నెలల్లో రెండు వందలు, మూడు వందలు ఇలా పెంచుకుని పోతామని కేజ్రివాల్ చెప్పారు.

ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పది గంటల వరకు పనిచేసే 1076 టోల్‌ఫ్రీ కాల్‌సెంటర్‌కు ప్రజలు ఫోన్ చేసి తమ ఇంటివద్దకు ఏ సేవ కావాలో తెలియజేయాలని కోరారు. పైగా, ఈ సేవలు అందాయో లేదో పర్యవేక్షించడానికి ఈ కాల్‌సెంటర్ 24 గంటలూ పనిచేయనున్నది. తాము ప్రవేశపెట్టిన ప్రజల ముంగిటకు సేవలందించే పథకంలో ఢిల్లీ ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలనుకుంటున్నట్టు ఆయన తెలిపారు.

కులధ్రువీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, నీటి కనెక్షన్ ఇలా ఎన్నో సేవలు ఢిల్లీవాసుల వద్దకే వస్తాయి. అయితే ఈ సేవల నిమిత్తం అదనంగా రూ 50 వసూలు చేస్తారు. ఇది పరిపాలనా విధానంలో ఒక విప్లవాత్మకమైన మార్పు అని ఆయన పేర్కొన్నారు.

ఢిల్లీ ప్రజలు గంటలు గంటలు వీటి కోసం లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. దీనివల్ల ప్రజల సమయం ఎంతో ఆదా అవుతుందని, దళారులకు ఎలాంటి సొమ్ములు లంచంగా ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.  ఈ పథకంలోని లోటుపాట్లు, ఇబ్బందులు తమకు తెలియజేస్తే వచ్చే 10-15 రోజుల్లో వాటిని సరిచేసుకుంటామని తెలిపారు. ఈ పథకం కింద ప్రభుత్వం రూ 12 కోట్లు ఖర్చు చస్తున్నది.

అలాగే ప్రజల వద్దకే రేషన్‌ను సరఫరా చేసే పథకం త్వరలోనే వాస్తవరూపం దాల్చనుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనిపై తమకు ఇప్పటివరకు ఉన్న అడ్డంకులను త్వరలోనే అధిగమించి ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆయన తెలిపారు. ప్రజల ముంగిటకే సేవలు పథకం అమలు బాధ్యతను ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పగించినట్టు ఆయన చెప్పారు. ఇలావుండగా ఈ పథకాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ ఏడాది మొదట్లోనే ప్రవేశపెట్టాలని చూసినా, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బజాజ్ దానిని నిలుపుదల చేశారు.