రైతు భరోసాపై మాట మార్చిన జగన్ ప్రభుత్వం

వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లపాటు రైతులకు పెట్టు బడి సాయం అందిస్తామని హామీ ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా రైతులకు ఇచ్చేపెట్టుబడి సాయం రూ.6వేలు పోను రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.6500 కలిపి మొత్తం రూ.12500 ఇస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ  శాసన మండలిలో తెలిపారు. 

కౌలు రైతులకు కేంద్రం సొమ్ము ఇవ్వదని అందు వల్ల రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం సొమ్ము రూ.12500 అందచేస్తుందని ఆయన వివరించారు. మంత్రి బొత్స సమా ధానంతో మాజీ మంత్రి నారా లోకేష్‌ గుండెపై చేయి వేసుకుని మీరు ఇచ్చేది రూ.6500 కదా, ఈ సమా ధానం చాలు మాకు అంటూ వ్యాఖ్యానించారు. 

గత కొంత కాలంగా ముఖ్యమంత్రి జగన్‌, మంత్రులు, వైసిపి నాయకులు కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో సంబంధం లేకుండా రూ.12500 చెల్లిస్తామని చెబుతూ వస్తున్నారు. 2017 జులై 8న గుంటూరులో జరిగిన ప్లీనరీలో నవరత్నాల ప్రకటనలో భాగంగా రైతులకు ఏటా రూ.50వేల చొప్పున నాలుగేళ్ల పాటు రూ.12500 చొప్పున చెల్లిస్తామని ప్రకటించారు. ఇదే అంశాన్ని పాదయాత్రలో, మేనిఫెస్టోలో కూడా చెబుతూ వచ్చారు.