ఇసుక తవ్వకాలపై జగన్‌ సర్కారు యు టర్న్‌

ఇసుక తవ్వకాల విషయంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అనూహ్యంగా యు-టర్న్‌ తీసుకుంది. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో జరుగుతున్న తవ్వకాల్లో ఎటువంటి అక్రమాలు లేవని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి)కి తెలిపింది. నిబంధనల ప్రకారమే అన్ని తవ్వకాలు జరిగాయని వివరించింది. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై అమరావతికి చెందిన రైతు అనుమోలు గాంధీ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌లో రూ 100 కోట్ల పెనాల్టీ విధిస్తూ ఎన్‌జిటి ఇచ్చిన ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే.

ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూపిటిషన్‌పై మంగళవారం ఎన్‌జిటిలో వాదనలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది ఆర్‌. వెంకట రమణి వాదిస్తూ చట్టానికి లోబడే కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలు జరిగాయని తెలిపారు. గత తీర్పు సందర్భంగా ఎన్‌జిటి నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నివాసానికి సమీపంలో జరుగుతున్న తవ్వకాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

తాజా, వాదనల సందర్భంగా అప్పటి సిఎం ఇంటి సమీపంతో పాటు కృష్ణా ఇతర ప్రాంతాల్లో జరిగిన తవ్వకాలన్నీ సక్రమంగానే ఉన్నాయని న్యాయవాది ఎన్‌జిటికి వివరించారు. డ్రిడ్జింగ్‌ ద్వారా జలరవాణాకు ప్రయత్నిస్తున్నామని ఆ క్రమంలో పూడిక తీతలో భాగంగా రాజధాని ప్రాంతంలో ఇసుక తవ్వకాలు జరిగాయని వివరించారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న ఎన్‌జిటి బెంచ్‌ జోక్యం చేసుకుంటూ జలరవాణాకు కూడా అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని , అటువంటి అనుమతులు తీసుకున్నారో లేదో స్పష్టం చేయాలని ఆదేశించింది.

పిటిషనర్‌ తరపు న్యాయవాది శ్రావణ్‌ కుమార్‌ వాదనలు వినిపిస్తూ ఏపి సర్కార్‌ ఎన్జీటీ ముందు వాదిస్తున్నదానికి, రాష్ట్రంలో జరుగుతున్న దానికి పొంతన లేదని తెలిపారు.  రాష్ట్రంలో ఏపి సర్కార్‌ ఇసుక తవ్వకాలను ఆపిందని, విధానాన్ని మార్పు చేసేందుకు ప్రయత్నిస్తోందని వివరించారు.