గ్రేటర్‌లో పది సీట్లకై టిడిపి పట్టు

ఒకవంక కాంగ్రెస్, టిజేఎస్, సిపిఐ లతో కలసి మహాకుటమి ఏర్పాటుకి సై అంటూనే సీట్ల విషయంలో తెలంగాణ టిడిపి నాయకులు ఇంకా చర్చలు ప్రారంభం కాకుండానే మొండి పట్టును ప్రదర్శిస్తున్నారు. పొత్తు పెట్టు కోవాలంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత ఎన్నికలలో తమ పార్టీ గెలుపొందిన తొమ్మిది సీట్లతో పాటు, మరో సీట్ – మొత్తంగా పది సీట్లను ఇవ్వాల్సిందే అని స్పష్టం చేస్తున్నారు.

దాంతో ఆయా నియోజకవర్గాలపై ఆశలు పెంచుకున్న కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సనత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, కంటోన్మెంట్‌, ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి, శేర్‌లింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, రాజేంద్రనగర్‌, మహేశ్వరం నియోజకవర్గాల్లో విజయం సాధించారు. వీరిలో ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే ఆర్‌ కృష్ణయ్య మినహా అందరూ టీఆర్‌ఎస్‌ తీర్థం తీసుకున్నారు.

 ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో సీట్ల సర్దుబాటు ఉంటే తమకు ఉప్పల్‌, కూకట్‌పల్లి, శేర్‌లింగంపల్లి, మలక్‌పేట, ముషీరాబాద్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, కుత్బుల్లాపూర్‌, అంబర్‌పేట్‌, సనత్‌నగర్‌ నియోజకవర్గాలను కేటాయించాలని టీడీపీ నేతలు కోరుతున్నట్టు తెలుస్తోంది. దాంతో ఆ పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

టీడీపీ కోరుతున్న నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్‌ ప్రముఖులు ఉండడంతో ఆ సీట్లను పార్టీ అధిష్ఠానం వదులుకోకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. లేని పక్షంలో కాంగ్రెస్ అసమ్మతి ఎదుర్కొనవలసి వస్తుంది. ఇప్పటికే పొత్తులు అనైతికమంటూ ఉప్పల్‌ నియోకజవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి బండారి లక్ష్మారెడ్డి, నాచారం కార్పొరేటర్‌ శాంతి సహా ముఖ్య నాయకులందరితో కలిసి పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించారు.

గ్రేటర్ లో 24 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేదు. మూడు చోట్ల మాత్రమె ద్వితీయ స్థానంలో ఉండగా టిడిపి 9, బిజెపి 5, ఎంఐఎం 7, టీఆర్‌ఎస్‌ 3 స్థానాల్లో విజయం సాధించాయి. ఇప్పుడు టిడిపి తెలంగాణలో కోరుకొనే స్థానాలలో సగం హైదరాబాద్ నగరంలోనే ఉండే పరిస్థితి ఉంది.

అయితే అప్పటి బలాన్ని బట్టి ఇప్పుడు సీట్లు కుదరదని, మారిన రాజకీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. అప్పుడు టిడిపితో ఉన్న బిజెపి ఇపుడు లేదని, కాంగ్రెస్ పార్టీ ఆ నాలుగేళ్ళలో బలం పుంజుకున్నదని పేర్కొంటున్నారు.