అసెంబ్లీ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీలో తొలి సస్పెన్షన్ నేడు జరిగింది. సభ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. సమావేశాలు ముగిసే వరకూ వీరి సస్పెన్షన్ కొనసాగనుంది. సస్పెన్షన్‌కు గురైన వారిలో అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు ఉన్నారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు అడ్డుపడుతున్నారనే కారణంతో ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌ను మంత్రి బుగ్గన ప్రతిపాదించారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు సభలోనే ఉండి నినాదాలు చేస్తున్నారు. 

అయితే వారిని సభా సమావేశాలు ముగిసే వరకూ కాకుండా సభా సంప్రదాయాలు పాటించని వారిని శాశ్వతంగా బహిష్కరించాలని చీఫ్‌ విప్ శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.  

వైసీపీ ఎమ్మెల్యేలను సీఎం జగన్ కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారని బుచ్చయ్య చౌదరిఎద్దేవా చేశారు. కడప ఫ్యాక్షన్ రాజకీయాలు తీసుకురావద్దని  స్పష్టం చేశారు. సస్పెండ్ చేసినా తమ పోరాటం ఆగదని వెల్లడించారు.  

ముగ్గురు టిడిపి సభ్యులను సస్పెండ్‌ చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా మండిపడ్డారు. తేనీటి విరామ సమయంలో ఉపసభాపతి కోన రఘుపతితో భేటీ అయి నిరసన తెలియజేయడం సభ్యుల హక్కు అని, దానిని కూడా కాలరాయడం అప్రజాస్వామికమతుందని నిరసన వ్యక్తం చేశారు. 

ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తన స్థానంలోనే ఉన్నారని, అతడిని సస్పెండ్‌ చేయడం దారుణమని  ఆయనతో చెప్పారు. ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన గోరంట్ల బుచ్చయ్య చౌదరిని తొలిసారి సస్పెండ్‌ చేశారని, ఇది అన్యాయమని విస్మయం వ్యక్తం చేశారు. 

తదుపరి ఏపీ అసెంబ్లీ నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యులు వాకౌట్‌ చేశారు. ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయడం, సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం పట్ల నిరసన తెలుపుతూ సభ నుంచి వాకౌట్ చేశారు.   

ఈ  సందర్భంగా డిప్యూటీ స్పీకర్‌ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేలు మూడు ఆప్షన్లను ఉంచారు. క్వశ్చన్‌ అవర్‌లో తమ నాయకుడికి అవకాశం ఇవ్వాలని కోరతారు. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను ఈ రోజుకే పరిమితం చేయాలని.. సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేస్తే టీడీపీ సభ్యులందరినీ చేయాలని తెలిపారు.

సభ నిర్వహణకు సహకరించేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. సభలో టీడీపీ అడ్డు తొలగించాలని చూడడం సరికాదని టీడీపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.