మోడీ పాలన, అభివృద్ధి చూసే బీజేపీలో చేరికలు

ప్రధాని నరేంద్ర మోదీ పారదర్శక పాలన, అభివృద్ధిని చూసి ఎంతో మంది ఆకర్షితులై బీజేపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు షేక్ ఖాజా ఆలీ నేతృత్వంలో 300 మంది కార్యకర్తలు బీజేపీలో చేరిక సందర్భంగా విజయవాడలో మాట్లాడుతూ ప్రధాని మోదీ ఐదేళ్ల పాలన పట్ల దేశ ప్రజలంతా సంతృప్తి చెందారని చెప్పారు. ముఖ్యంగా 2019 ఎన్నికల తర్వాత ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీజేపీలోకి చేరికలు పెరిగాయని గుర్తు చేశారు.

పార్టీలోకి వస్తున్న షేక్ ఖాజా ఆలీకి పార్టీ కండువా కప్పి హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే పోలవరం ముంపు మండలానికి చెందిన వైసీపీ, జనసేన పార్టీల నాయకులు దొంతు యోగేశ్వరరావు, పాటిమి కృష్ణ ఆధ్వర్యంలో కార్యకర్తలు బీజేపీలో చేరారు.

ఇలా ఉండగా, తొలగించిన ఎంపీఈఓలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఏపీ వ్యవసాయ, ఉద్యానశాఖ ఎంపీఈఓ అసోసియేషన్ ధర్నా చౌక్ వద్ద రెండు వారాలుగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తోంది. ఈ నిరసన ప్రదర్శనను కన్నా సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలా తొలగించడం వల్ల 4700 కుటుంబాలు వీధిన పడ్డాయని, పని చేస్తున్నవారిని తొలగించడం అన్యాయమని, వెంటనే తొలగించిన వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కన్నా డిమాండ్ చేశారు.

కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 3 లక్షల మందిని బీజేపీలోకి సభ్యులుగా చేర్చాలని కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. బీజేపీ విజయవాడ నగర శాఖ ఆధ్వర్యంలో జరిగిన కిసాన్ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గొంటూ రైతులకు మునుపెన్నడూ ఇవ్వని రీతిలో బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యంగా, భూసార పరీక్షా కార్డులు, వ్యవసాయ ఉత్పత్తులకు మద్ధతు ధరలు పెంపు, ఫసల్ బీమా పథకం అమలు, కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అమలు చేయడం ద్వారా దేశంలోని 14.50 కోట్ల రైతులందరికీ ఏడాదికి రూ. 6 వేల ఆర్థిక సాయం అందిస్తున్నారని వివరించారు.