సోమవారమూ కొలిక్కి రాని కర్ణాటక విశ్వాస పరీక్ష

కర్ణాటక రాజకీయ సంక్షోభానికి తెరపడలేదు. క్షణ క్షణం ఉత్కంఠ రేపిన ‘కుమార’ బల పరీక్ష వ్యవహారం సోమవారం అర్ధరాత్రి అయినా ఎటూ తేలకపోవడంతో విధాన సభ మంగళవారానికి వాయిదా పడింది. మంగళవారం సాయంత్రం 4గంటలకు బలాన్ని నిరూపించుకోవాలని స్పీకర్‌ కేఆర్ రమేశ్ కుమార్‌ అధికార పక్షానికి డెడ్‌లైన్‌ విధించారు. కాంగ్రెస్‌ తరఫున కొంత మంది మాట్లాడాల్సి ఉందని, రాత్రి 8గంటల వరకు సమయం ఇవ్వాలని  సిద్ధరామయ్య కోరగా.. అందుకు సాధ్యం కాదని స్పీకర్‌ తేల్చి చెప్పారు. దీంతో మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు చర్చను ముగించి.. సాయంత్రం 6గంటలకు విశ్వాస పరీక్షను నిర్వహిస్తామని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. దీంతో సభను స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ మంగళవారానికి వాయిదా వేశారు. తిరిగి సభ ఉదయం 11గంటలకు ప్రారంభం కానుంది.

అంతకుముందు విశ్వాసపరీక్షపై చర్చ జరుగుతున్నప్పుడు రాజీనామా చేసిన ఎమ్మెల్యేల భవితవ్యం తేలే వరకు విశ్వాస పరీక్షను వాయిదా వేయాలని స్పీకర్‌పై కాంగ్రెస్ ఒత్తిడి తెచ్చింది. సోమవారం అసెంబ్లీ ప్రారంభం కాగానే విశ్వాస పరీక్ష మరింత జాప్యం కారాదని స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి స్పీకర్ విశ్వాస పరీక్ష ప్రక్రియ సోమవారం ముగిస్తామని ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని పదేపదే గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ మనల్ని గమనిస్తున్నారు. దయచేసి నన్ను బలి పశువును చేయొద్దు. మనమంతా లక్ష్యానికి చేరుకోవాల్సిందే అని అన్నారు.

రెండు రోజుల విరామం తర్వాత తిరిగి సోమవారం ప్రారంభమైనప్పటికీ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. విశ్వాస పరీక్షను వాయిదా వేయాలని అధికార పక్షం.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజే నిర్వహించాలని విపక్షం పట్టుబట్టడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎంత రాత్రయినా సభలోనే ఉంటాం.. బల నిరూపణ పూర్తిచేయాల్సిందేనని ప్రతిపక్ష నేత యడ్యూరప్ప పట్టుబట్టగా.. ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారాన్ని తేల్చకుండా బలనిరూపణ ఏంటని సీఎం కుమారస్వామి ప్రశ్నించారు.

మనం ప్రజా జీవితంలో కొనసాగుతున్నామన్న సంగతి మరిచిపోవద్దని, చర్చల పేరిట సాగదీయవద్దని కూటమి నేతలకు స్పీకర్ హితవు చెప్పారు. అసెంబ్లీలో విపక్ష నేత బీఎస్ యెడ్యూరప్ప మాట్లాడుతూ ఈ రోజు విశ్వాసపరీక్షపై ఓటింగ్ జరుగాల్సిందేనని చెప్పారు. సీఎం కుమారస్వామి మాట్లాడుతూ తాను రాజీనామా చేసినట్లు బూటకపు రాజీనామా లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని స్పీకర్‌కు చూపారు. ప్రస్తుత పరిస్థితుల్లో విశ్వాస పరీక్షపై చర్చను పొడిగించాలని కోరారు. అందుకు స్పీకర్ రమేశ్‌కుమార్ ససేమిరా అని అన్నారు.

ఇదిలా ఉంటే విశ్వాస పరీక్ష చేపట్టకుండానే సీఎం కుమారస్వామి రాజీనామాకు సిద్ధపడ్డారని, రాత్రి ఏడు గంటలకు గవర్నర్ వాజుభాయి వాలా అపాయింట్‌మెంట్ కోరినట్టు వచ్చిన ఈ వార్తలను సీఎంవో తోసిపుచ్చింది. కాగా, రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీచేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు తనను కలుసుకోవాలని స్పష్టంచేశారు. మరోవైపు తక్షణం విశ్వాస పరీక్షపై ఓటింగ్ జరిపేందుకు స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆర్ శంకర్, హెచ్ నగేశ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించనున్నది.