'వైఎస్‌ఆర్‌ రైతు భరోసా' మొత్తంపై జగన్ ప్రభుత్వంలో అస్పష్టత!

రైతులకు పెట్టుబడి సాయం అందించే 'వైఎస్‌ఆర్‌ రైతు భరోసా' ఎంత అనే విషయంపై జగన్ ప్రభుత్వంలో అస్పష్టత రాజ్యమేలుతోంది. వైసిపి సర్కారు పూర్తి స్థాయి బడ్జెట్‌తో పాటే ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టినా భరోసాపై అస్పష్టత పోలేదు. ఈ ఏడాది రబీ నుంచే భరోసాను అమలు చేస్తామన్న ప్రభుత్వం, అందుకు అక్టోబర్‌ 15 తేదీని ఖరారు చేసింది. ఇంకా విధి విధానాలు, మార్గదర్శకాలపై ఎలాంటి ఉత్తర్వులూ వెలువడనప్పటికీ బడ్జెట్‌, బడ్జెట్‌ సందర్భంగా సర్కారు విడుదల చేసిన సామాజిక, ఆర్థిక సర్వేల్లో పేర్కొన్న అంశాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి.

ప్రభుత్వ వర్గాలైతే విధి విధానాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందేనని తప్పించుకుంటున్నాయి. కౌల్దార్లతో సహా రాష్ట్రంలో వ్యవసాయం చేసే ప్రతి రైతు కుటుం బానికీ భరోసా కింద సంవత్సరానికి రూ.12,500 ఇస్తామని నవరత్నాల్లో భాగంగా వైసిపి హామీ ఇచ్చింది. సిఎం హోదాలో జగన్మోహన్‌రెడ్డి అదే మాట చెప్పారు. ఇదే సమయంలో ఏడాదిలో మూడు విడత ల్లో పిఎం కిసాన్‌ సమ్మాన్‌ కింద కేంద్రం రూ.6 వేలు ఇస్తోంది. కేంద్రం ఇచ్చే రూ.ఆరు వేలతో కలిపి రాష్ట్రం రూ.12,500 ఇస్తుందా లేక తాను ఇస్తానన్న రూ.12,500 మొత్తాన్నీ ఇస్తుందా అనే విషయం ఇంకా తేల్లేదు.

వ్యవసాయ బడ్జెట్‌లో రైతు కుటుంబానికి రూ.12,500 ఇస్తామంది సర్కారు. అందుకోసం 2019-20 బడ్జెట్‌లో రూ.8,750 కోట్లు ప్రతిపాదించింది. మొత్తంగా 64.07 లక్షల రైతు కుటుం బాలకు భరోసా అందిస్తామని, అందులో 15.37 లక్షల కౌలు రైతులూ ఉన్నారని పేర్కొంది. దాని ప్రకారం స్వంత భూమి కలిగిన రైతు కుటుంబాలు 48.7 లక్షలు. ప్రతి కుటుంబానికీ రూ.12,500 చొప్పున బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. 

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ప్రభుత్వమే విడుదల చేసిన సామాజిక, ఆర్థిక సర్వేలో మాత్రం భరోసాను కేంద్ర పథకంతో కలిపే అమలు చేస్తున్నట్లు తెలిపింది. కేంద్రం ప్రతి రైతు కుటుంబానికీ రూ.6 వేల వంతున ఇస్తోందని, రూ.12,500లో అవి పోను మిగతా రూ.6,500ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని పేర్కొంది. కౌలు రైతులకు కేంద్రం నయాపైసా కూడా ఇవ్వనందున వారికి రూ.12,500 మొత్తాన్నీ రాష్ట్రమే అందిస్తుందంది. వాటికి సంబంధించిన అంచనాలు సర్వేలో ఇచ్చారు.

భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌ (సిసిఎల్‌ఎ) సేకరించిన సమాచారం మేరకు ఎపిలో 15,35,642 మంది కౌలు రైతులున్నారని, వారికి రూ.12,500 చొప్పున సాయం చేయడానికి రూ.1,919.55 కోట్లు కావాలని అంచనా వేశారు. మొత్తంగా 68,83,711 మంది రైతులకు సాయం చేయాలంటే రూ.5,396 కోట్లు అవసరం అవుతాయన్నారు. 

కాగా అన్నదాత సుభీభవ కింద టిడిపి సర్కారు ఇచ్చిన జీవోను వైసిపి సర్కారు రద్దు చేయలేదని చెబుతున్నారు. 'అన్నదాత' ప్రకారం కౌలు రైతులకు ఈ ఖరీఫ్‌ నుంచి రూ.15 వేలు, ఐదెకరాల్లోపు రైతులకు రూ.9 వేలు, ఐదెకరాలకుపైన వారికి రూ.10 వేలు ఇస్తామన్నారు. కేంద్ర పథకాన్ని విడిగా చూపారు. ఐదెకరాల్లోపు రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేల చొప్పున ఇస్తామన్నారు.