రెండేళ్లుగా కాంగ్రెస్ తో అంటకాగుతున్న టిడిపి

తెలుగు దేశం పార్టీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ తో చెలిమి చేయడం లేదని, రెండేళ్ళుగా ఆ పార్టీతో అంతకాగుతున్నదాని బిజెపి ఎపి అద్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు తన చేతుల్లోకి లాక్కొని ఆయన ఆశయాలకు వెన్నుపోటు పోడిచారని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టిందని కన్నా గుర్తుచేశారు. టీడీపీ డ్రామా కంపెనీ అని, పార్టీ సిద్ధాంతం అంటూ ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో చంద్రబాబు కన్నా అవినీతిపరుడు మరొకరు లేరని తేల్చిచెప్పారు. ఆపరేషన్‌ గరుడ అంటూ కొత్త నాటకంతో సినీనటుడు ముందుకు వచ్చాడని పేర్కొన్నారు. స్వలాభం కోసం చంద్రబాబు ఎవరితోనైనా చేతులు కలుపుతారని ధ్వజమెత్తారు.

చంద్రబాబు నాయకత్వంలో  టీడీపీ ఓ డ్రామా కంపెనీగా మారిందని బీజేపీ నేత ఎద్దేవా చేశారు. వీటిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు పచ్చి అవకాశవాది అని అంటూ గతంలో కాంగ్రెస్ పార్టీని దూషించి ఇప్పుడు ఆ పార్టీతో చేతులు కలపడం పచ్చి అవకాశవాదమని విమర్శించారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో పర్యటించి ‘ఇంటింటికి బీజేపీ’ని తీసుకెళ్తామని చెప్పారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌లో 2019లో పార్లమెంట్, శాసనసభ ఎన్నికలకు సన్నద్ధం కావాలని బీజేపీ కేంద్ర నాయకత్వం పలు మార్గదర్శకాలు చేసిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా వెల్లడించారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ఆయన ఏపీలో పార్టీ పరిస్థితి, రాజకీయ వ్యవహారాలపై చర్చించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పరిస్థితి, తదితర అంశాలను ఈ నెల 20న బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో చర్చించి అనుసరించాల్సిన వ్యూహంపై నిర్ణయం తీసుకుంటామని తేలిపారు.