చంద్రయాన్‌ 2 చరిత్రలో అద్భుతమైన ఘట్టం

 ‘ప్రతి భారతీయుడు అత్యంత గర్వపడే రోజు ఇది’ అని చంద్రయాన్ 2 ప్రయోగం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) మీద ప్రశంసలు కురిపించారు. జాబిల్లిపై పరిశోధనల కోసం చంద్రయాన్‌ 2 ఉపగ్రహాన్ని ఇస్రో సోమవారం శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించింది. దానిపై వరస ట్వీట్లతో మోదీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

‘మన చరిత్రలో అద్భుతమైన క్షణాలు ఇవి! చంద్రయాన్‌ 2 ప్రయోగం మన శాస్త్రవేత్తల నైపుణ్యాన్ని, శాస్త్ర రంగంలో కొంత పుంతలు తొక్కాలన్న 130 కోట్ల మంది దేశ ప్రజల నిబద్ధతను చూపిస్తోంది. ప్రతి భారతీయుడు ఈ రోజు చాలా గర్వంగా ఉన్నాడు. మనసులో, స్ఫూర్తిలో భారతీయత తొణికసలాడింది' అని తెలిపారు. 

చంద్రయాన్‌ 2 పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించడం ఈ రోజు ప్రతి భారతీయుడి ఆనందానికి అత్యంత ముఖ్యకారణమని పేర్కొన్నారు. రిమోట్ సెన్సింగ్ కోసం ఆర్బిటార్, చంద్రుడి ఉపరితలాన్ని విశ్లేషించడానికి లాండర్‌-రోవర్ ఈ మిషన్‌లో ఉన్నాయి. జాబిల్లి దక్షిణ ధ్రువం మీద పరిశోధనలు చేయడమే ఈ ప్రయోగం ప్రధానోద్దేశమని ప్రధాని తెలిపారు. 

`గతంలో ఏ మిషన్ అక్కడ పరిశోధనలు చేయలేదు. దీనివల్ల వల్ల కొత్త విషయాలు తెలుసుకోనున్నాం. ఈ ప్రయోగానికి సంబంధించిన పరిశోధనలు యువతను శాస్త్రరంగం, పరిశోధన, ఆవిష్కరణల వైపు దృష్టి సారించేలా చేస్తాయి. చంద్రయాన్‌ 2 ప్రయోగానికి కృతజ్ఞతలు. దీని వల్ల చందమామకు సంబంధించి మన పరిజ్ఞానం మరింత మెరుగుకానుంది’ అని మోదీ ట్వీట్లు చేశారు.