50 రోజుల్లో హామీల మేరకు పరుగులు పెట్టిస్తున్న అభివృద్

బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే రెండోసారి అధికారంలోకి వచ్చి జులై 20 నాటికి 50 రోజులు పూర్తయింది. అఖండ విజయాన్ని సొంత చేసుకున్న బిజెపి  తొలి యాభై రోజుల్లో వేసిన అడుగులను వివరిస్తూ సోమవారం రిపోర్టు కార్డు విడుదల చేసింది. ఈ సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అభివృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.

సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాల అమలు వేగం గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే పెరిగిందని చెప్పారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కల కాదని..దాన్ని సాధించడం కోసం ఇప్పటికే కార్యాచరణ రూపొందించామని వివరించారు. మోదీ ప్రభుత్వం ఎంత సమర్థంగా పనిచేస్తుందో తొలి 50 రోజుల పాలనలోనే నిరూపితమైందని పేర్కొన్నారు.

సామాజిక న్యాయం, మౌలిక, విద్యా రంగాల్లో ఎన్డీయే ప్రభుత్వం ఇప్పటికే చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని జావడేకర్‌ వివరించారు. రైతులు, వ్యాపారులు, నిరుద్యోగులు, పేద మధ్యతరగతితో పాటు సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం చర్యలు చేపట్టామని చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై ప్రధాని హాజరు.. ప్రపంచ రాజకీయాలపై భారత్‌ ప్రభావాన్ని స్పష్టం చేస్తోందని తెలిపారు.

రోడ్డు, రైలు, విమాన మార్గాలతో పాటు ఇతర మౌలికవసతులపై దాదాపు వచ్చే ఐదేళ్లలో రూ.100 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని వెల్లడించాయిరు. అలాగే ప్రత్యేక జలశక్తి మంత్రిత్వ శాఖ, 2024నాటి ప్రతి ఇంటినీ నల్లానీరు లాంటి చరితాత్మక నిర్ణయాలతో మోదీ-2 ప్రభుత్వం దూసుకెళుతోందని జావడేకర్‌ అభిప్రాయపడ్డారు. 

ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు ఆహ్వానిస్తున్నామని.. దీని వల్ల ఉద్యోగ కల్పనకు అవకాశాలు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సబ్‌కా సాథ్‌, సభకా వికాస్‌, సబ్‌కా విశ్వాస్ నినాదంతో అన్ని వర్గాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా 50రోజుల పాలన సాగిందని చెప్పుకొచ్చానారు. అలాగే రైతులందరికీ రూ.ఆరు వేల ఆర్థిక సాయం, కొన్ని పంటలకు కనీస మద్దతు ధరను పెంచడం వంటి కీలక నిర్ణయాలు ఈ 50రోజుల్లోనే జరిగాయని గుర్తుచేశారు.

రెండోసారి అధికారం చేపట్టిన మోదీ.. అమరులైన సైనికులు, పోలీసులు కుటుంబాల్లోని పిల్లలకు ఉపకారవేతనం కల్పిస్తూ తొలి నిర్ణయం తీసుకున్నారు. 303 సీట్ల అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మోదీ మే 30న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.